21 వేల కోట్లతో 111 హెలికాప్టర్లు

26 Aug, 2018 03:22 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత నౌకాదళం కోసం రూ.21,000 కోట్లతో 111 యుటిలిటీ హెలికాప్టర్లు కొనాలన్న ప్రతిపాదనకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. మరో రూ.25,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకూ ఓకే చెప్పింది. ఢిల్లీలో జరిగిన రక్షణ పరికరాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శత్రు స్థావరాలపై దాడి, నిఘా, గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొనే  111 యుటిలిటీ హెలికాప్టర్లను రూ.21,000 కోట్లకుపైగా వ్యయంతో నేవీ కోసం కొనుగోలు చేయనున్నారు. వీటిని వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ–స్వదేశీ సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే తయారుచేస్తాయి.

సైన్యం కోసం రూ.3,364.78 కోట్లతో దేశీయంగా అభివృద్ధి చేసిన 150 అత్యాధునిక 155 ఎంఎం అర్టిలరీ గన్స్‌ కొనుగోలు ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం తెలిపింది. సబ్‌ మెరైన్లపై దాడిచేయగల 24 నేవల్‌ మల్టీరోల్‌ హెలికాప్టర్ల కొనుగోలుకూ డీఏసీ పచ్చజెండా ఊపింది. 14 స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన రక్షణశాఖ, వీటిలో 10 వ్యవస్థలు దేశీయంగా అభివృద్ధి చేసినవి అయ్యుండాలని షరతు పెట్టింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వ్యూహాత్మక భాగస్వామ్య విధానం కింద విదేశీ ఆయుధ కంపెనీలతో జట్టుకట్టే భారత ప్రైవేటు కంపెనీలు.. యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలను తయారుచేసేందుకు మాత్రమే వీలుంది.

>
మరిన్ని వార్తలు