పబ్‌ జీ ఎఫెక్ట్‌: ఇంట్లో దొంగతనం చేసిన బాలుడు

3 Mar, 2020 16:48 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లో మరో పబ్‌జీ కేసు నమోదైంది. పబ్‌జీ ఆటలో ఓడిపోయినందుకు ఓ 12 ఏళ్ల బాలుడు తన ఇంట్లో దొంగతనం చేసిన వింత ఘటన కచ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం విషయం వెలుగులోకి వచ్చింది. కిరాణ దుకాణం నడుతున్న బాలుడి తల్లిదండ్రులు తమ బిరువాలో డబ్బు దొంగతనానికి గురవుతున్నట్లు గుర్తించారు. ఇక ఈ విషయంపై నిఘా పెట్టిన వారికి సోమవారం రాత్రి బాలుడు డబ్బులు దొంగతనం చేస్తూ తల్లిదండ్రులకు దొరికిపోయాడు. ఈ విషయంపై కొడుకుని పట్టుకుని ప్రశ్నించడంతో.. అతను తన స్నేహితులతో కలిసి పబ్‌ జీ ఆడుతూ ఓడిపోవడంతో ఇంట్లోని బిరువాలో ఉన్న రూ. 3 లక్షలను దొంగతనం చేశానని ఒప్పకున్నట్లు బాధిత తల్లిదండ్రలు పోలీసులకు తెలిపారు.

కాగా.. కొంత మంది యువకులు తమ కొడుకుని ఖరీదైనా మొబైల్‌ ఫొన్‌లకు, గేమ్‌లకు ఆకర్షితుడు అయ్యేలా చేశారని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఈ కోణంలో బాలుడిని విచారించడంతో తాను దొంగలించిన డబ్బును వారికి ఇచ్చానని.. వారు ఆ డబ్బుతో ఖరిదైనా ఫోన్‌లు కొనుకున్నట్లు పోలీసులకు చెప్పాడు. ​కాగా వారు కావాలనే తమ కొడుకుని దొంగతనం చేసేలా ప్రొత్సహించి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి యువకులను అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు డబ్బు కోసమే బాలుడిని ట్రాప్‌ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇక వారంత మైనర్లు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు