135 మంది క్రీడాకారులకు ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు

14 Oct, 2016 02:18 IST|Sakshi
135 మంది క్రీడాకారులకు ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలు

► రాష్ట్రం నుంచి ఎంపికైన 8 మంది ఆటగాళ్లు
► నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ

 
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడాకారులను ఒలింపిక్స్‌కు వెళ్లేలా ప్రోత్సహిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా వివిధ క్రీడలకు చెందిన 135 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ)లో ఉద్యోగాలు ఇస్తూ బండారు దత్తాత్రేయ వారికి నియామక పత్రాలను అందించారు. గురువారం ఇక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణకు చెందిన 8 మంది క్రీడాకారులు కూడా ఈ పత్రాలను అందుకున్నారు. రాష్ట్రం నుంచి టేబుల్ టెన్నిస్ విభాగంలో పి. బాలదుర్గారావు, వి. శ్రీకాంత్, ఎం.నికిత, కబడ్డీ విభాగంలో నల్ల గోవర్ధనరెడ్డి, ఎం. లింగం యాదవ్, బ్యాడ్మింటన్ విభాగంలో కె.ఆదిత్య కిరణ్, పి.అరుణ్ కుమార్, ఆర్చరీ విభాగంలో జి. లక్ష్మణ్ ఎంపికయ్యారు.

కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్, కేంద్ర నైపుణ్యాభివృధ్ది శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, ఎంపీలు మనోజ్ తివారీ, మీనాక్షి లేఖి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించడానికి 135 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించినందుకు ఈఎస్‌ఐసీని అభినందించారు. ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా దీక్ష, పట్టుదలతో క్రీడాకారులు విజయంకోసం కృషి చేయాలని దత్తాత్రేయ సూచించారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పతకాలను అందుకునే విధంగా ప్రయత్నించాలని, కార్మిక మంత్రిత్వ శాఖ తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. తాను కూడా క్రీడాకారుడినేనని, గతంలో కబడ్డీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించానని ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. క్రీడల మంత్రి విజయ్ గోయల్ మాట్లాడుతూ, ఈఎస్‌ఐసీ చొరవను అభినందించారు. కార్మిక శాఖను ఆదర్శంగా తీసుకుని ఇతర శాఖలు కూడా క్రీడాకారులను ప్రోత్సాహించాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు