ఒక్క రోజులో 14 ‘జెట్‌’ విమానాల రద్దు

3 Dec, 2018 10:12 IST|Sakshi

ముంబై: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు పైలట్లు సహకరించకపోవడంతో ఆదివారం ఆ సంస్థకు చెందిన 14 విమానాలు రద్దయ్యాయి. పైలట్లు సహా పై స్థాయి ఉద్యోగులకు సెప్టెంబర్‌ నెల వేతనాలను పాక్షికంగా చెల్లించిన జెట్‌ ఎయిర్‌వేస్‌.. అక్టోబర్, నవంబర్‌ నెల జీతాలను మాత్రం ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదు. దీంతో కొందరు పైలట్లు తమకు అనారోగ్యంగా ఉందనే సాకు చూపుతూ ఆదివారం అకస్మాత్తుగా విధులకు గైర్హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో 14 విమానాలను జెట్‌ ఎయిర్‌వేస్‌ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎదురైన నిర్వహణ పరిస్థితుల కారణంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందనీ, పైలట్లు సహకరించకపోవడం వల్ల కాదని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు విషయాన్ని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేశామనీ, వీలైనంత మందిని ఇతర విమానాల్లో పంపి, మిగతా వారికి పరిహారం చెల్లించామంది.  

>
మరిన్ని వార్తలు