డేంజర్‌ జోన్‌లో మన నగరాలు

2 May, 2018 16:04 IST|Sakshi

జెనీవా : ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్యభరిత నగరాల్లో భారత్‌ అగ్రభాగాన నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం జెనీవాలో విడుదల చేసిన ప్రపంచ కాలుష్య డేటాబేస్‌ నివేదికలో టాప్‌ 15 నగరాల్లో 14 నగరాలు భారత్‌కు చెందినవే కావడం గమనార్హం. ఈ జాబితాలో కాన్పూర్‌ అత్యంత కాలుష్యభరిత నగరంగా ముందువరుసలో నిలిచింది. ఇక్కడ ప్రమాదకారక పీఎం 2.5  స్థాయి 173 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇక ప్రపంచంలో అత్యంత కాలుష్యనగరాల్లో వరుసగా ఫరీదాబాద్‌, వారణాసి, గయ, పట్నా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, ముజఫర్‌పూర్‌, శ్రీనగర్‌, గుర్‌గావ్‌, జైపూర్‌, పటియాలా, జోథ్‌పూర్‌లు నిలిచాయి. ఈ జాబితాలో 15వ స్ధానంలో కువైట్‌కు చెందిన అలి సుబా అల్‌సలేం నిలిచింది.

ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై ఇటీవల నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ 6వ స్థానంలో ఉంది. 2010, 2014 మధ్య ఢిల్లీలో కాలుష్య స్థాయి కొంత మెరుగైనా 2015లో మళ్లీ పరిస్థితి విషమించింది. వాయు కాలుష్యం కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేసింది. కాలుష్య సంబంధ గుండె జబ్బులతో 34 శాతం మంది మరణిస్తుంటే 21 శాతం మంది న్యుమోనియా, 20 శాతం మంది స్ర్టోక్‌ కారణంగా మరణిస్తున్నారు. వాయు కాలుష్యంతో వాటిల్లుతున్న మరణాల్లో 19 శాతం శ్వాససంబధిత సీఓపీడీ వ్యాధి కారణంగా, ఏడు శాతం మంది లంగ్‌ క్యాన్సర్‌తో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు