ఆవును చంపితే 14 ఏళ్లు.. మనిషిని చంపితే రెండేళ్లు:జడ్జి

17 Jul, 2017 18:19 IST|Sakshi
ఆవును చంపితే 14 ఏళ్లు.. మనిషిని చంపితే రెండేళ్లు:జడ్జి

న్యూఢిల్లీ: లగ్జరీ కారుతో ఓ మోటార్‌ సైక్లిస్టును ఢీ కొట్టిన ఘటనలో ఇండస్ట్రియలిస్ట్‌ తనయుడికి ఢిల్లీ కోర్టు 2 సంవత్సరాల శిక్షను శనివారం విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో 2008లో జరిగిన ఈ ఘటనపై గత తొమ్మిదేళ్ల విచారణకు తెరపడింది. 2008 సెప్టెంబర్‌ 11వ తేదీన బీబీఏ చదువుతున్న భసిన్‌.. తన బీఎండబ్ల్యూ కారుతో దక్షిణ ఢిల్లీలోని మూల్‌చంద్‌ ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌పై తన స్నేహితుడు మృగాంక్‌ శ్రీవాస్తవతో కలిసి వెళ్తున్న అనుజ్‌ చౌహన్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ప్రమాద అనంతరం చండీఘర్‌కు పారిపోతున్న భసిన్‌ను పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు. ఈ కేసును పలుమార్లు విచారించిన సెషన్స్‌ కోర్టు భసిన్‌కు రెండేళ్ల పాటు శిక్షను విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, భసిన్‌కు శిక్ష విధిస్తూ సెషన్స్‌ కోర్టు జడ్జి సంజీవ్‌ కుమార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆవును చంపిన వ్యక్తికి 5 నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష పడుతోందని.. అదే మనిషిని చంపిన వ్యక్తికైతే కేవలం 2 సంవత్సరాల శిక్షే పడుతోందని అన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్ధ అలా ఉందని తామేమైనా చేయడానికి సాయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. జడ్జిమెంట్‌ కాపీని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపుతున్నట్లు చెప్పారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 304-ఏలో మార్పులు చేయడానికి ఈ జడ్జిమెంట్‌ కాపీ ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు.

మరిన్ని వార్తలు