14 వేల బంకర్లు

8 Jan, 2018 03:17 IST|Sakshi

పాక్‌ సరిహద్దు వెంట నిర్మాణానికి కేంద్రం ఆమోదం

రూ.415 కోట్ల విడుదల

జమ్మూ: పాకిస్తాన్‌తో అంతర్జాతీయ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సరిహద్దుల వద్ద 14,460 బంకర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్తాన్‌ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ మోర్టార్లతో దాడు లు చేస్తున్నందున సరిహద్దు గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ బంకర్లను నిర్మించనున్నారు. కాగా, ఈ బంకర్ల నిర్మాణానికి కేంద్రం రూ.415.73 కోట్లను ఇటీవలే విడుదల చేసింది. ఈ భూగర్భ బంకర్లలో ఎల్‌వోసీ వెంట పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో 7,298, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, కథువా, సాంబా జిల్లాల్లో 7,162 బంకర్లను నిర్మించనున్నారు.

ఇందులో 13,029 వ్యక్తిగతమైనవి కాగా, 1,431 సామాజిక బంకర్లున్నాయి. వ్యక్తిగత భూగర్భ బంకర్లు 160 చదరపు అడుగులు (ఎనిమిది మంది ఉండేందు కు వీలుగా), సామాజిక బంకర్లు 800 చదరపు అడుగులు (40 మంది ఉండేందుకు వీలుగా) ఉంటాయి. గతేడాది పాకిస్తాన్‌ కవ్వింపు చర్యల కారణంగా 35 మంది (23 మంది సైనికులు, 12 మంది పౌరులు) మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం బంకర్ల నిర్మాణానికి చొరవతీసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు