కరోనా కలవరం: మొత్తం 28 పాజిటివ్‌ కేసులు

4 Mar, 2020 12:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) తాజాగా భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప‍్పటికే ఢిల్లీ, తెలంగాణలో వైరస్‌లను గుర్తించగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన మరో 16 మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయులు కాగా 16 మందిని ఇటలీకి చెందిన వారుగా పేర్కొన్నారు. దీంతో భారతదేశంలో ఇప్పటివరకు 28 కరోనా వైరస్‌ పాజిటివ్  కేసులను  గుర్తించామని  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్  బుధవారం అధికారికంగా ధృవీకరించారు. వీరులో ఒకరు ఢిల్లీకి చెందినవారు. ఆగ్రాలో ఆరుగురు, 16 మంది ఇటాలియన్లు, వారికి  డ్రైవర్‌గా పనిచేసిన భారతీయుడు, తెలంగాణలో ఒకరు, ఇప్పటికే నిర్ధారించిన కేసులు అని తెలిపారు. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణీకులందరూ ఇప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవలసి ఉంటుందని తెలిపారు. . వీరందరినీ  ఎయిమ్స్‌లోని  ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త కేసులు గుర్తించడంతో భారతదేశంలో కరోనా వైరస్ భయాందోళనలు పెరుగుతున్నాయి. 

మరోవైపు ఇటలీ నుండి తిరిగి వచ్చి ఢిల్లీ నివాసి ఏర్పాటు చేసిన పార్టీకి కొంతమంది విద్యార్థులు హాజరైనందున రెండు నోయిడా పాఠశాలల్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఎవరికీ వైరస్‌ సోకలేదని తేలింది.  కాగా చైనాలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 80,270 కు చేరుకుంది. మార్చి 3 నాటికి మొత్తం చైనాలో మరణాల సంఖ్య 2,981కి చేరింది.  ఇటలీలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 79కి చేరింది. కరోనా వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ అమెరికా సహా ఇతర దేశాలలో వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఇలావుంటే  కరోనా వైరస్‌ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని  ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని  ప్రకటించారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని ట్వీట్‌ చేశారు. 

చదవండి :  హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!

మరిన్ని వార్తలు