2 వేల కి.మీ. సైకిల్‌పై ప్ర‌యాణించ‌నున్న వ‌ల‌స కార్మికులు

6 May, 2020 11:58 IST|Sakshi

కాలిబాట‌న స్వ‌స్థ‌లానికి ప‌య‌న‌మైన గ‌ర్భిణీ

ముంబై: ప‌దులు.. వందలు కాదు... వేల కిలోమీట‌ర్ల‌ను లెక్క చేయ‌కుండా ప్ర‌యాణం సాగించేందుకు సిద్ధ‌మ‌య్యారు. బ‌తుకు పోరాటం కోసం అడుగడుగునా ఎదుర‌య్యే క‌ష్టాల‌ను సైతం పంటి బిగువున‌ భ‌రిస్తామంటున్నారు. అటు భానుడి ప్ర‌తాపాన్ని ఇటు పోలీసుల ఆగ్ర‌హాన్ని భ‌రిస్తూ ముందుకు సాగ‌నున్నామ‌ని ఆయాసంతో చెప్తున్నారు వ‌ల‌స కార్మికులు. బీహార్‌లోని ద‌ర్భంగాకు చెందిన 15 మంది వ‌ల‌స కూలీలు ముంబైలో ప‌ని చేస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల ప‌నులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోవ‌డంతో వారి పొట్ట కొట్టిన‌ట్ట‌యింది. అన్నం ప‌ట్టే నాధుడు లేక‌, రోజుల త‌ర‌బ‌డి ఆక‌లికి ఆగ‌లేక క‌ష్ట‌మైనా న‌ష్ట‌మైనా స్వ‌స్థ‌లాల‌కు వెళ్లి క‌లో గంజో తాగి బతుకుతామంటున్నారు. అందుకోసం నేడు తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యారు. (క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్న వ‌ల‌స కూలీలు)

బ‌తుకు చిధ్ర‌మై 45 రోజులు..
అయితే వారిని గ‌మ‌నించిన కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు "మీ కోసం ప్ర‌త్యేక రైళ్లు కేటాయించారు క‌దా? ఎందుకు దాన్ని వినియోగించుకోవ‌ట్లే"ద‌ని ప్ర‌శ్నించారు. దీనికి కార్మికులు బ‌దులిస్తూ.. "14వ తేదీ త‌ర్వాత ఇంటికి పంపిస్తామ‌ని చెప్పారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు మ‌ళ్లీ ఎలాంటి స‌మాచార‌మివ్వ‌లేదు. ఇప్ప‌టికే బ‌తుకు చిధ్ర‌మై 45 రోజుల‌వుతోంది. ఇంకా అధికారుల నుంచి పిలుపు కోసం ఎదురు చూడ‌లేక ఇలా బ‌య‌లు దేరుతున్నాం" అని ఓ వ‌ల‌స కార్మికుడు ఆవేద‌న వెల్ల‌గ‌క్కాడు. ఇదిలా వుండ‌గా న‌వీ ముంబైకి చెందిన మ‌రో 20 మంది వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాలైన బుల్దానాకు కాలిబాట‌న బ‌య‌లుదేరారు ఇందులో ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తితో పాటు చిన్న‌పిల్ల‌లు కూడా ఉన్నారు. వారు కొద్దిపాటి ఆహారాన్ని కూడ‌బెట్టుకుని న‌డ‌క సాగిస్తున్నారు. (ఈ టెన్షన్‌ ఎటువైపో?)

మరిన్ని వార్తలు