ఆయుధ సామగ్రికి 15వేల కోట్లు

14 May, 2018 03:03 IST|Sakshi

ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఆర్మీ

న్యూఢిల్లీ: భారత రక్షణ బలగాలకు అవసరమైన యుద్ధసామగ్రిని దేశీయంగా తయారుచేసేందుకు రూ. 15 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు ఆర్మీ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకుల కోసం వివిధ రకాల మందుగుండు, యుద్ధ సామగ్రిని భారత్‌లోనే తయారుచేస్తారు. సైన్యానికి అవసరమైన మందుగుండు దిగుమతుల్లో భారీ జాప్యాన్ని నివారించడంతో పాటు.. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అవసరమయ్యే మందుగుండు నిల్వల పరిమాణాల్ని తగ్గించేందుకు కూడా ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో 11 ప్రైవేటు సంస్థలు పాలుపంచుకోనున్నాయి. దీని అమలును ఆర్మీ, రక్షణ శాఖలోని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఎంతో రహస్యంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు తక్షణ లక్ష్యం.. యుద్ధం సమయంలో 30 రోజులకు అవసరమైన యుద్ధ సామగ్రిని అందించడం కాగా.. దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడం. ‘మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 15 వేల కోట్లు.. 10 ఏళ్లకు సంబంధించి తయారు చేయాల్సిన యుద్ధ సామగ్రి పరిమాణంపై లక్ష్యాన్ని పెట్టుకున్నాం’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు.

మొదటి దశలో రాకెట్లు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, ఆర్టిలరీ గన్స్, పదాతి దళం కోసం యుద్ధ వాహనాలు, గ్రనేడ్‌ లాంచర్లు, యుద్ధ రంగంలో వాడే వివిధ ఆయుధాల్ని నిర్దేశిత గడువులోగా తయారుచేస్తారు. మందుగుండు నిల్వలు వేగంగా తగ్గిపోవడంపై కొన్నేళ్లుగా ఆర్మీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చైనా తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధ సామగ్రి తయారీపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టింది.

మరిన్ని వార్తలు