15 వేల మంది జడ్జీలు అవసరం

16 Jan, 2017 03:36 IST|Sakshi
15 వేల మంది జడ్జీలు అవసరం

జిల్లా కోర్టుల్లో 2.8 కోట్ల పెండింగ్‌ కేసులు

  •  జూన్‌ 2016 నాటికి 1.89 కోట్ల కేసుల పరిష్కారం
  •  కిందిస్థాయి కోర్టులపై సుప్రీం నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో ప్రమాదకర స్థాయిలో దాదాపు 2.8 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని సుప్రీం కోర్టు విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అలాగే 5 వేల జడ్జీల పదవులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ‘భారత్‌లోని కిందిస్థాయి కోర్టులపై నివేదిక 2016’ పేరిట వివరాలు వెల్లడిస్తూ... జిల్లా కోర్టుల్లో సిబ్బందిని కనీసం ఏడు రెట్లు పెంచాలని, రాబోయే మూడేళ్లలో సంక్షోభం అధిగమించేందుకు దాదాపు 15 వేల మందికి పైగా జడ్జీల్ని నియమించాలని సూచించింది.

జిల్లా కోర్టులపై సుప్రీం నివేదిక ప్రకారం... జూలై 1, 2015– జూన్‌ 30, 2016 మధ్య దేశవ్యాప్తంగా 2,81,25,066 సివిల్, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1,89,04,222 కేసుల్ని కిందిస్థాయి కోర్టులు పరిష్కరించాయి. జిల్లా కోర్టుల్లో జడ్జీల కొరత వల్లే ఇంత భారీ స్థాయి లో కేసులు అపరిష్కృతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 4,954 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉండగా... అనుమతించిన న్యాయాధికారుల సంఖ్య 21,324 మందిగా నివేదిక పేర్కొంది.

10 లక్షల మందికి 50 మంది జడ్జీలు
‘మా అధ్యయనం ప్రకారం, భవిష్యత్తులో కేసుల పెరుగుదల దృష్ట్యా అపరిష్కృత కేసుల పరిష్కారానికి ప్రస్తుతమున్న జడ్జీల సంఖ్య సరిపోదు. అదనపు సిబ్బంది, సహాయక సిబ్బంది అవసరంతో పాటు మౌలిక వసతులు కల్పించి పరిస్థితిని చక్కదిద్దడం తక్షణావసరం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉండాలని, ప్రతీ 10 లక్షల మందికి 50 మంది జడ్జీలు ఉండేలా చూడాలన్న సుప్రీం తీర్పును పాటించాలని సూచించింది. అలాగే ఐపీసీ కేసుల్లో దాదాపు 13 శాతం మాత్రమే విచారణ పూర్తి చేసుకుంటున్నట్లు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) కూడా పేర్కొందన్న విషయాన్ని సుప్రీం గుర్తుచేసింది.  ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు, బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జడ్జీల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో వరుసగా 794, 792, 624 మంది జడ్జీలు భర్తీ కావాలి. ఉత్తరప్రదేశ్‌లో 58.8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటిలో 43.73 లక్షలు క్రిమినల్‌ కేసులే.

>
మరిన్ని వార్తలు