దేశంలో మద్యపాన ప్రియులు 16 కోట్లు

19 Feb, 2019 04:09 IST|Sakshi

తర్వాతి స్థానం గంజాయిదే

సామాజికన్యాయం–సాధికారత మంత్రిత్వ శాఖ సర్వే

న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 14.6 శాతం (16 కోట్ల మంది) మద్యం సేవించేవారు ఉన్నారని ఓ సర్వే ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది. మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయి. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని సర్వేకోసం ప్రామాణికంగా తీసుకున్నారు. మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు చికిత్స పొందుతున్నారు.

ప్రతి 180 మందిలో ఒకరు ఏదో ఒక సమయంలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నవారే. 15ఏళ్ల విరామం తర్వాత ఎయిమ్స్‌ ఆధ్వర్యంలోని ఎన్‌డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం– సాధికారత శాఖ ఈ సర్వే చేసింది. ‘గతంలో 2001లోనూ సర్వే చేసి 2004లో ఫలితాలను ప్రకటించినా, అది రాష్ట్రాల వారీగా పూర్తి గణాంకాలను సమర్పించలేదు. అయితే ప్రస్తుత సర్వే దేశంలో గణనీయమైన స్థాయిలో మత్తు పదార్థాల వినియోగాన్ని తెలుపుతోంది. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది.

వయోజనుల్లో ఈ రుగ్మతల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని సర్వే స్పష్టం చేసింది’ అని నివేదిక తయారుచేశాం’ అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్‌ గెహ్లాట్‌ చెప్పారు. జాతీయ స్థాయిలో 186 జిల్లాలలో ఈ సర్వే చేశారు. దేశ జనాభాలో 2.8 శాతం (దాదాపు మూడు కోట్లు) గత 12 నెలల కాలంలో తాము గంజాయి లాంటి మత్తు పదార్థాలను రుచిచూశామని చెప్పారు. సాధారణ మత్తు మందు ఉపయోగించే వారి సంఖ్య 1.14 కాగా, ఔషధ మత్తు మందులు (వైద్యులు చెప్పిన పరిమితికన్నా ఎక్కువ) ఉపయోగించే వారు 0.96 శాతం. 0.52 శాతం ప్రజలు సాధారణంగా లభించే నల్లమందును వాడుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు