అట్టుడుకుతున్న యూపీ

22 Dec, 2019 01:51 IST|Sakshi
కాన్పూర్‌లో ఆందోళనకారులు పోలీస్‌ పోస్ట్‌ వద్ద వాహనాలను తగలబెట్టిన దృశ్యం

‘పౌర’ ఆందోళనల్లో 16కు చేరిన మృతులు

ఆందోళనకారులే కాల్చుకున్నారన్న యూపీ సర్కార్‌

అస్సాం, బెంగాల్‌లో పరిస్థితులు ప్రశాంతం

ప్రతిపక్షాల దుష్ప్రచారంపై బీజేపీ కార్యాచరణ

న్యూఢిల్లీ/లక్నో/పుణే: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. నిరసనకారుల దాడిలో 263 మంది పోలీసులు గాయాలపాలు కాగా, వీరిలో 57 మంది బుల్లెట్‌ గాయాలయ్యాయని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పిలుపు మేరకు శనివారం బంద్‌ జరిగింది. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాం, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో శనివారం పరిస్థితులు సద్దుమణిగాయి. పౌరసత్వ సవరణ చట్టంపై సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మూడు కోట్ల కుటుంబాలకు అవగాహన కల్పిస్తామని బీజేపీ తెలిపింది.

పోలీస్‌ ఠాణాకు నిప్పు
శుక్రవారం జరిగిన ఆందోళనల్లో ఆరుగురు మృతి చెందడంపై నిరసనకారులు శనివారం రాంపూర్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయినప్పటికీ, 12– 18 ఏళ్ల వయస్సున్న బాలురు సహా 500 మంది ఆందోళనకారులు రాంపూర్‌ ఈద్గా సమీపంలో గుమికూడి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఆందోళనకారులు గాయపడగా  ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో డజను మంది పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘర్షణలకు స్థానికేతరులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో నిరసనలు కొనసాగాయి. కాన్పూర్‌లో ఆందోళనకారులు యతీమ్‌ఖానా పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు.  

వాళ్లే కాల్చుకున్నారు: డీజీపీ ఓపీ సింగ్‌
రాష్ట్రంలో ఎక్కడా పోలీసులు కాల్పులు జరపలేదని, ఆందోళనకారులే అక్రమంగా తెచ్చుకున్న ఆయుధాలతో కాల్చుకున్నారని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ వ్యాఖ్యానించారు. ‘నిరసనకారులు మహిళలు, చిన్నారులను అడ్డుపెట్టుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల అక్రమంగా ఆయుధాలతో కాల్పులకు దిగుతున్నారు. దీంతో పోలీసులు అంతిమ ప్రయత్నంగా టియర్‌గ్యాస్, లాఠీచార్జీలను వాడాల్సి వస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోల వారూ నిరసనలకు దిగుతున్నారు. అల్లర్ల వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉందంటూ వస్తున్న వార్తలపైనా దర్యాప్తు జరుపుతాం’ అని ఆయన  తెలిపారు. లక్నోలో ఇప్పటి వరకు 218 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు.

కోర్టు ఆదేశాల మేరకు లక్నోలో ఆందోళనల్లో సంభవించిన నష్టం వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులకు నోటీసులు జారీ చేసి నష్టాన్ని రాబడతామన్నారు. లక్నోలో ఈ నెల 23 వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ నేరాలకు పాల్పడిన 705 మందిని అరెస్టు చేశామని, 4,500 మందిని నిర్బంధంలోకి తీసుకున్నామని ఐజీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు 102 మందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలో నిరసనకారుల దాడిలో క్షతగాత్రులైన 263 మంది పోలీసు సిబ్బందిలో 57 మందికి బుల్లెట్‌ గాయాలయ్యాయని ఐజీ ప్రవీణ్‌ వెల్లడించారు. ఆందోళనలు జరిగిన ప్రాంతాల నుంచి 405 ఖాళీ బుల్లెట్‌ కేసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫిరోజాబాద్‌ జిల్లాలో శనివారం జరిగిన వివిధ ఆందోళనల్లో ముగ్గురు మృతి చెందారని ఎస్పీ సచీంద్ర తెలిపారు.  

మహారాష్ట్ర కూడా వ్యతిరేకించాలి: పవార్‌
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ కేంద్రాన్ని కోరారు. ఈ చట్టంపై ఇప్పటికే వ్యతిరేకత ప్రకటించిన 8 రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కూడా చేరాలని ఆయన సూచించారు. ఈ చట్టాన్ని అమలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

అవగాహన కల్పిస్తాం: బీజేపీ  
చట్ట సవరణపై వ్యక్తమవుతోన్న తీవ్రమైన వ్యతిరేకతకు చెక్‌పెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. దీనిలో భాగంగా వచ్చే పది రోజుల్లో దాదాపు మూడు కోట్ల కుటుంబాలను కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడతామని, దేశవ్యాప్తంగా 250 మీడియా సమావేశాలు పెడతామని అన్నారు. ఈ చట్టం వల్ల లబ్ధిపొందిన కుటుంబాల వారిని కూడా ఈ ప్రచారంలో భాగస్వాములుగా చేస్తామన్నారు.

భీం ఆర్మీ చీఫ్‌  అరెస్ట్‌
ఢిల్లీలోని దార్యాగంజ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధం ఉందనే ఆరోపణలతో భీం ఆర్మీ ఛీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆజాద్‌ను 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆజాద్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దార్యాగంజ్‌ ఘటనకు సంబంధించి మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుభాష్‌ మార్గ్‌లో పార్కు చేసి ఉన్న ఓ ప్రైవేటు కారుకి ఆందోళన కారులు నిప్పు పెట్టారనీ, అల్లర్లకు పాల్పడ్డారనీ పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలతో సంబంధమున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చట్టానికి 1,100 మంది విద్యావేత్తల మద్దతు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్నవేళ దేశ విదేశీ విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు సవరణ చట్టానికి అనుకూలంగా స్పందించారు. పౌరసత్వ చట్టాన్ని స్వాగతిస్తూ 1,100 మంది తమ సంతకాలతో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంతకాలు చేసిన వారిలో షిల్లాంగ్‌ ఐఐఎం చైర్మన్‌ శిశిర్‌ బజోరియా, నలందా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సునైనా సింగ్, జేఎన్‌యూ ప్రొఫెసర్‌ ఐనుల్‌ హసన్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్, కన్‌ఫ్లిక్ట్‌ స్టడీస్‌ పరిశోధనా సంస్థలో సీనియర్‌ అధ్యాపకుడు అభిజిత్‌ అయ్యర్‌ మిత్ర, పాత్రికేయుడు కంచన్‌ గుప్తా, రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌గుప్తా తదితరులు ఉన్నారు. అనవసరంగా భయాందో ళనలు చెందాల్సిన పనిలేదని, పుకార్ల భ్రమల్లో పడకూడదని ఈ లేఖ ద్వారా మేధావులు సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కోరారు. శాంతియుతంగా ఆలోచించాలని సూచించారు. భారతదేశ నాగరికతను కాపాడేందుకు, మైనారిటీల హక్కుల రక్షణకోసం పార్లమెంటు ప్రయత్నిస్తోందంటూ ఈ లేఖలో కొనియాడారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శనివారం పట్నాలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు

>
మరిన్ని వార్తలు