కంపెనీ ఉద్యోగుల‌కు క‌రోనా.. బాధితులు ప‌రార్

23 Jun, 2020 12:31 IST|Sakshi

చండీగఢ్‌: క్వారంటైన్ కేంద్రంలో చికిత్స  పొందుతున్న 17 మంది క‌రోనా బాధితులు త‌ప్పిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వివ‌రాలిలా ఉన్నాయి.. ప్ర‌ముఖ ఆటో దిగ్గ‌జం మారుతి సుజుకి కంపెనీలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంట్లో 17 మంది ఉద్యోగుల‌కు కొన్ని రోజుల క్రిత‌మే క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అయితే ఈ విష‌యంపై  యాజ‌మాన్యం  అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌కుండా కంపెనీకి ద‌గ్గ‌ర్లోనే ఓ ఇంట్లో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ స‌మాచారాన్ని బ‌య‌ట‌కు పొక్క‌నివ్వ‌లేద‌ని అధికారులు ఆరోపిస్తున్నారు. (కర్ణాటక మంత్రి భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్‌ )

అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ సోమ‌వారం నుంచి 17 మంది క‌రోనా బాధితులు క్వారంటైన్ సెంట‌ర్ నుంచి త‌ప్పించుకోవ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై పోలీసులు కంపెనీ యాజ‌మాన్యంపై కేసు న‌మోదుచేసి ఉద్యోగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అంత‌కుముందు 67 మంది క‌రోనా పాజిటివ్ రోగులు వివిధ క్వారంటైన్ కేంద్రాల‌నుంచి పారిపోవ‌డంపై అధికారుల నిర్ల‌క్ష్యం బట్ట‌బ‌య‌లైన సంగ‌తి తెలిసిందే.  గురుగ్రామ్‌లో సోమ‌వారం ఒక్క‌రోజే 85 కొత్త క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు వైద్యా ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క గురుగ్రామ్ జిల్లాలొనే 4,512 కేసులు న‌మోద‌వ‌గా 1,820 యాక్టివ్ కేసులున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇక దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంటల్లోనే 14,933 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా, వైర‌స్ కార‌ణంగా 312 మంది చ‌నిపోయిన‌ట్లు మంగ‌ళ‌వారం కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ( 24 గంటల్లో 14 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు )

మరిన్ని వార్తలు