ఢిల్లీ హోటల్లో మంటలు

13 Feb, 2019 03:03 IST|Sakshi
అగ్నికి ఆహుతయ్యాక మసిబారిన హోటల్‌ పైఅంతస్తు , హోటల్‌ వర్కర్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న అతని భార్య, బంధువులు

17 మంది దుర్మరణం

ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి దూకి ఇద్దరు మృతి

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్‌ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. మరో 35 మందికి గాయాలపాలయ్యారు. సెంట్రల్‌ ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని నాలుగంతస్తుల అర్పిత్‌ ప్యాలెస్‌ హోటల్‌లో మంగళవారం వేకువజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హోటల్‌లో 53 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అందరూ గాఢ నిద్రలో ఉండటంతో మంటల నుంచి తప్పించుకోవడం కష్టమైందని, అత్యవసర ద్వారం బయటి నుంచి మూసేసి ఉందన్నారు. హోటల్‌లో కర్రతో చేసిన ఫర్నీచర్‌ ఎక్కువ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు భావిస్తున్నారు. హోటల్‌ జనరల్‌ మేనేజర్‌తో పాటు మరో ఉద్యోగిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆప్‌ సర్కారు తన నాలుగో వార్షికోత్సవాన్ని రద్దుచేసుకుంది.

ఊపిరాడకే ఎక్కువ ప్రాణనష్టం..
అర్పిత్‌ ప్యాలెస్‌ హోటల్‌ మొదటి అంతస్తులో మొదలైన మంటలు వేగంగా పైకి ఎగబాకాయి. షార్ట్‌ సర్క్యూటే నిప్పును రాజేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు వేగంగా విస్తరించడంతో నిద్రలో ఉన్న అతిథులు తప్పించుకోవడం కష్టమైంది. ఎక్కువ మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు కాలిన గాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. హోటల్‌ గదుల్లో వాడిపడేసిన కార్బన్‌ డయాక్సై డ్‌ సిలిండర్లు కనిపించాయి. దీనినిబట్టి మంటలను ఆర్పడానికి వారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

హోటల్‌ పైకప్పు నుంచి దట్టమైన పొగ వెలువడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తీసిన వీడియోలో కనిపించింది. ప్రమాదం జరిగిన సుమారు గంట తరువాత అంటే ఉదయం 4.35 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన ప్రమాదస్థలికి 24 ఫైరింజన్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరణించిన 17 మందిలో 10 మందిని గుర్తించారు.  అందులో ముగ్గురు కేరళ, ఒకరు గుజరాత్, ఇద్దరు మయన్మార్‌ నుంచి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. మిగిలిన నలుగురిని గుర్తించినా, వారు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియరాలేదు. ఒక వ్యక్తి జాడ గల్లంతైనట్లు డీసీపీ మాధుర్‌ వర్మ తెలిపారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు మరణం..
కేరళలోని ఎర్నాకులం నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో మృతిచెందారు. 57 ఏళ్ల సోమశేఖర్‌   అనే వ్యక్తి తన తల్లి (84), అన్న(59), చెల్లెలు (53)తో కలసి ఘజియాబాద్‌లో బంధువు వివాహానికి హాజరయ్యేందుకు వచ్చి ఈ హోటల్‌లో బస చేశారు. వీరిలో సోమశేఖర్‌ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.

విశాఖ రిఫైనరీ ఉద్యోగి మృతి
మల్కాపురం(విశాఖ): ఢిల్లీ హోటల్‌ అగ్నిప్రమాదంలో హెచ్‌పీసీఎల్‌ (విశాఖ రిఫై నరీ)ఉద్యోగి చలపతిరావు(55) మృతి చెందారు. హెచ్‌పీసీఎల్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న చలపతిరావు సోమవారం ఢిల్లీలో జరిగిన పెట్రోటెక్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వెళ్లి అర్పిత్‌ హోటల్లో బస చేశారు. మంగళవారం ఉదయం తిరిగి విశాఖపట్నానికి తిరిగిరావల్సి ఉండగా, ఇంతలోనే ప్రమాదం ఆయన్ని బలితీసుకుంది. ఆయన మృత దేహం బుధవారం ఉదయంకల్లా ఇక్కడికి చేరుకునే అవకాశాలున్నాయి. చలపతిరావు భార్య, పిల్లలతో విశాఖలోని ఎండాడ వద్ద నివాసముంటున్నారు.



మార్చురీ వద్ద రోదిస్తూ బంధువులకు సమాచారం చేరవేస్తున్న బాధితురాలు

మరిన్ని వార్తలు