మావో పంజా

23 Mar, 2020 04:39 IST|Sakshi
మావోల కాల్పుల్లో మృతి చెందిన భద్రతా సిబ్బంది

ఛత్తీస్‌గఢ్‌లో భీకర ఎన్‌కౌంటర్‌ 

17 మంది జవాన్ల మృతి,14మందికి గాయాలు

డ్రోన్ల సాయంతో మృతదేహాల గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు ధరించిన మావోయిస్టులు ఆకస్మిక దాడి చేసి 17 మంది జవాన్లను బలితీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాలోని చింతగుఫా ఏరియాలో మీన్పా అడవుల్లో నక్సల్‌ కమాండర్‌ హీడ్మా, వినోద్, దేవా శిబిరం ఏర్పాటు చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో 250 నుంచి 300 డీఆర్‌జీ (జిల్లా రిజర్వ్‌ గార్డులు), ఎస్‌టీఎఫ్‌ (స్పెషల్‌టాస్క్‌ఫోర్స్‌) జవాన్లతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు వారికి తారసపడ్డారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారు.

దాదాపు 8 గంటలపాటు కాల్పులు..
వేసవి రావడంతో ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ ఏడాది కూడా ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా మావోయిస్టుల కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపులు మొదలుపెట్టారు. చింతగుఫా సమీపంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో దాదాపు 300 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య శనివారం మధ్యాహ్నం 12.40 నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 8 గంటలపాటు వందలాది రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో గాయపడ్డ 14 మందిని హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఎన్‌కౌంటర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో జరగడం, రాత్రి వరకు కొనసాగడంతో 17 మంది జవాన్ల జాడ తెలియకుండాపోయింది. ఆదివారం డ్రోన్ల సాయంతో గాలించగా.. ఆ 17 మంది విగతజీవులుగా కనిపించారు. అనంతరం బలగాలు ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.  

అమరులైన జవాన్లు వీరే.. :డీఆర్‌జీ విభాగం
కానిస్టేబుళ్లు హేమంత్‌దాస్, లిబ్రూరాం, సోయం రమేష్, వంజెం నాగేష్, మడకం మాసా, పొడియం లక్మా, మడకం ఇడమా, వంజం నితేంద్రం, అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లు గంధం రమేష్‌ , ఉయికా కమిలేష్, పొడియం ముత్తా, ఉయికా దుర్బా, ఎస్టీఎఫ్‌ విభాగం కానిస్టేబుళ్లు సీతారాం రాశ్యా, హేమంత్‌బోయ్, అమర్‌జిత్‌ కల్లోజీ, అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లు నారోద్‌ మితాడ్, మడకం ముచ్చు.  

బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లలో మావోలు...
బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, హెల్మెట్లు ధరించిన మావోయిస్టులు భారీ ఆయుధాలతో ఆకస్మికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు అంటున్నారు.  ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మావోయిస్టులకు తక్కువ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చనంటున్నారు.

వారి ధీరత్వాన్ని మరచిపోం: మోదీ
భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన ఘాతుకంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండిస్తున్నాను. ఈ దాడిలో అమరవీరులైన భద్రతా బలగాలకు అంజలిఘటిస్తున్నాను. వారు చూపిన ధీరత్వాన్ని ఎన్నటికీ మరచిపోం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు