నాడు 170 మంది ఉగ్రవాదులు హతం

9 May, 2019 03:21 IST|Sakshi

బాలాకోట్‌పై భారత వాయుసేన దాడులపై

ఇటలీ జర్నలిస్ట్‌ మారినో కథనం

క్షతగాత్రులకు పాక్‌ ఆర్మీ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని వెల్లడి

న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్‌) చేసిన దాడిలో ఎవ్వరూ చనిపోలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తెల్లవారుజామున ఐఏఎఫ్‌ చేపట్టిన వైమానికదాడిలో 130 నుంచి 170 జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్‌ జర్నలిస్ట్‌ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు. ఐఏఎఫ్‌ దాడిలో ఘటనాస్థలిలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా, మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ ఉగ్రమూకలకు పాక్‌ మిలటరీ డాక్టర్లు వైద్యం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మారినో రాసిన కథనాన్ని ‘స్ట్రింగర్‌ ఆసియా’ అనే వెబ్‌సైట్‌ ప్రచురించింది.

మృతుల కుటుంబాలకు పరిహారం..
ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఐఏఎఫ్‌ యుద్ధవిమానాలు బాలాకోట్‌లోని ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని మారినో తెలిపారు. ‘ఈ దాడిలో 11 మంది శిక్షకులు సహా 170 మంది వరకూ చనిపోయారు. దాడి జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పాక్‌ ఆర్మీ క్షతగాత్రులను షింకియారీ ప్రాంతంలో ఉన్న హర్కతుల్‌ ముజాహిదీన్‌ క్యాంప్‌కు తరలించింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా 45 మంది ఉగ్రవాదులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్‌ ఖురాన్‌(మదర్సా)గా మార్చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదు’ అని చెప్పారు. అవసరమైతే బాలాకోట్‌లో భారత జర్నలిస్టులను అనుమతిస్తామని పాక్‌ ప్రకటించిన నేపథ్యంలో మారినో ఈ కథనం రాయడం గమనార్హం.

మరిన్ని వార్తలు