180 సీట్ల సామర్థ్యం.. నలుగురే ప్రయాణం

28 May, 2020 13:16 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల జీవన విధానంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో భౌతిక దూరాని తప్పకుండా పాటించేలా చూసుకుంటున్నారు. ప్రయాణికుల మధ్య ఎడం ఉండేలా సీట్లను వదులుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. కాస్త డబ్బున్న వాళ్లు రద్దీగా ఉండే ప్రజా రవాణాను కాకుండా, సొంత వాహనాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారవేత్తలైతే గంటల ప్రయాణానికి కూడా లక్షల్లో ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు.(‘కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్‌’)

వైరస్‌ భయంతో ఓ వ్యాపారవేత్త కుటుంబం ఏకంగా 180 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాన్ని కేవలం నలుగురి ప్రయాణానికి బుక్‌ చేసుకుంది. భోపాల్ నుంచి ఢిల్లీకి నలుగురు ప్రయాణించడానికి ఎయిర్‌బస్ ఏ320 విమానాన్ని బుక్‌ చేశారు. ప్రయాణించిన వారిలో తల్లి, ఇద్దరు పిల్లలు, వారి పనిమనిషి ఉన్నారు. ఇందుకు రూ.10 లక్షలు వరకు ఖర్చుచేసినట్టు విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. రెండు నెలల తర్వాత సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే.

ఏ320 విమానం ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం 9.05 గంటలకు కేవలం పైలట్, క్యాబిన్ క్రూతో బయలుదేరి భోపాల్ చేరింది. అక్కడ నలుగురిని ఎక్కించుకుని ఉదయం 11.30 గంటలకు తిరిగి బయలుదేరి 12.55కి ఢిల్లీకి చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో ఇతరులతో కలిసి ప్రయాణించడం గురించి చాలామంది వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికి విమానయాన సంస్థలు, చార్టర్ విమానాలను ఆఫర్ చేస్తున్నాయి. విమాన ప్రయాణానికి అతిపెద్ద నిర్వహణ వ్యయం అయిన ఇంధన ధరలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నందున, తక్కువ ధరకే విమానాలను అద్దెకు ఇవ్వడానికి పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.
(నేను సిద్ధం, ఉద్యోగులను లాగొద్దు : ట్విటర్‌ సీఈఓ)

మరిన్ని వార్తలు