తమిళనాడులో కీచకం

20 Jul, 2014 01:29 IST|Sakshi
తమిళనాడులో కీచకం

ప్రేమికుడిని చితక్కొట్టి యువతిపై గ్యాంగ్‌రేప్
 
కృష్ణగిరి(తమిళనాడు): దేశంలో మృగాళ్ల ఘాతుకాలకు తెరపడడం లేదు. కోర్టులు శిక్షలు వేస్తున్నా, ప్రభుత్వాలు ‘నిర్భయ’ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా అబలలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో నలుగురు కామాంధులు ఓ కళాశాల విద్యార్థినిపై శుక్రవారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(19) కృష్ణగిరిలోని కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. కావేరి పట్టణ సమీపం గ్రామానికి చెందిన ప్రేమికుడి(24)తో శుక్రవారం సాయంత్రం కారులో రాయకోట సమీపంలోని బోడంపట్టికి వెళ్లింది. అక్కడ రాయకోట హెచ్చంపట్టికి చెందిన సుబ్రమణి(28), రాఘవేంద్రనగర్‌కు చెందిన ప్రకాష్(24), రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మణి(22), గిడ్డం బట్టికి చెందిన ప్రకాశ్(24) అనే నలుగురు యువకులు ఆ జంటపై దాడిచేశారు. యువకుడిని చితక్కొట్టారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి  అత్యాచారానికి పాల్పడ్డారు. ఫొటోలు తీసుకున్నారు. ఎవరికైనా చెబితే వాటిని బయట పెడతామని బెదిరించారు. ఈ ఘోరాన్ని చూసిన ఓ పశువుల కాపరి బోడంపట్టి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు.  గ్రామస్తులు అక్కడికొచ్చేలోగా నిందితులు పారిపోయారు.  పోలీసులు శుక్రవారం రాత్రే నిందితులను  అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులో పెల్లుబికిన ఆగ్రహం:

బెంగళూరులో ఇటీవల ఓ స్కూల్లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం పట్ల నగర ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. శనివారం బాలిక తల్లిదండ్రులతోపాటు వందలాది  విద్యార్థులు, తల్లిందడ్రులు, ప్రజలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దారుణానికి పాల్పడిన వారిని శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.
 
 

>
మరిన్ని వార్తలు