అబూసలేం, ముస్తఫా దోషులే!

17 Jun, 2017 07:44 IST|Sakshi
అబూసలేం, ముస్తఫా దోషులే!

ముంబై పేలుళ్ల కేసులో టాడా ప్రత్యేక కోర్టు నిర్ధారణ
► మరో నలుగురినీ దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం
►  సోమవారం నుంచి శిక్షలపై విచారణ ప్రారంభం!


ముంబై: 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో సూత్రధారి ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేం సహా ఆరుగురిని టాడా ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. అబ్దుల్‌ ఖయ్యూం అనే మరో నిందితుడిని సరైన ఆధారాల్లేనందున నిర్దోషిగా ప్రకటించింది. 24 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో వీరికి విధించాల్సిన శిక్షలపై వాదనలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

రియాజ్‌ సిద్దిఖీ మినహా మిగిలిన ఐదుగురు అబూసలేం, ముస్తఫా , కరీముల్లా ఖాన్, ఫిరోజ్, అబ్దుల్‌ రషీద్‌ ఖాన్, తాహిర్‌ మర్చంట్‌లను నేరపూరిత కుట్ర, భారత శిక్షాస్మృతి, టాడా కింద హత్యానేరంతోపాటు వివిధ కేసులు, విధ్వంసక సామాగ్రి, ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజల ఆస్తులను విధ్వంసం చేసిన కేసుల్లో దోషులుగా ప్రకటించారు. సిద్దిఖీ మాత్రం అబూసలేం, ఇతరులకు ఆయుధాలు సరఫరా చేయటంలో సహకరించిన నేరంలో టాడా చట్టాల కింద దోషిగా తేల్చారు. వీరంతా తొలి విడత విచారణ చివర్లో అరెస్టయినందున వీరి విచారణను కోర్టు ప్రధాన కేసు నుంచి వేరుగా చేసి విడిగా విచారించింది.  

దుబాయ్‌ మీదుగా పాక్‌కు.. 257 మందిని పొట్టనపెట్టుకున్న 24 ఏళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి రెండో విడత విచారణలో భాగంగా టాడా కోర్టు తాజా తీర్పునిచ్చింది. 2007 నాటి తొలి æవిడత విచారణలో కోర్టు 100 మందిని దోషులుగా, 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 750 మంది ప్రాసిక్యూషన్‌ సాక్షులు, 50 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది. సీబీఐ విచారణలో సలేంతోపాటుగా ముగ్గురు తమ నేరాన్ని అంగీకరించారు బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నేతృత్వంలో టైగర్‌ మెమన్, యాకూబ్‌ మెమన్, మహ్మద్‌ దోసా, ముస్తఫా దోసాతో సహా పలువురు ఈ దాడులకు కుట్ర పన్నారు.

ప్రాసిక్యూషన్‌ వాదన ప్రకారం ముస్తఫా, టైగర్‌ మెమన్, ఛోటా షకీల్‌లు పాకిస్తాన్‌లో ఉగ్ర శిక్షణ క్యాంపులు నిర్వహించారు. భారత్‌ నుంచి దుబాయ్‌ మీదుగా పాకిస్తాన్‌కు యువకులను తీసుకెళ్లి వారికి ఆయుధ శిక్షణనిచ్చారు.  దావూద్‌ ఇబ్రహీం, ఛోటా షకీల్, టైగర్‌ మెమన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరంతా పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు భావిస్తున్నారు. ప్రపంచలోనే ఆర్డీఎక్స్‌ (సైక్లోట్రైమిథిలిన్‌ ట్రైనైట్రమిన్‌)ను భారీ సంఖ్యలో వినియోగించిన తొలి ఉగ్రదాడి ఇదే. ఆనాటి ఘటనలో 27 కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసం మయ్యాయి.

దావూద్‌నూ శిక్షించండి
1993 నాటి ఘటనకు ప్రధాన సూత్రధారి దావూద్‌ ఇబ్రహీంను భారత్‌కు తీసుకొచ్చి శిక్ష విధించినపుడే అసలైన న్యాయం జరిగినట్లని ముంబై పేలుళ్ల బాధితులు, బంధువులు తెలిపారు. దావూద్‌ను ఉరితీస్తేనే న్యాయం గెలిచినట్లని పేలుళ్లలో తల్లిని కోల్పోయిన తుషార్‌ప్రీతి తెలిపారు.

దోషులు ఏం చేశారు?
ముస్తఫా దోసా: భారత్‌కు ఆర్డీఎక్స్‌ను తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా కొందరు యువకులను పాకిస్తాన్‌కు పంపి ఆయుధాల వినియోగంలో శిక్షణనిప్పించారు.

అబూ సలేం: ఆయుధాలను గుజరాత్‌నుంచి ముంబైకి తరలించాడు. ఈ కేసులో దోషిగా శిక్ష పూర్తిచేసుకున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్‌ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు.

తాహిర్‌ మర్చంట్‌: పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని రెచ్చగొట్టాడు. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరించాడు.

ఫిరోజ్‌ అబ్దుల్‌ ఖాన్‌: ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్‌ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చాడు. దీంతోపాటుగా  వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నాడు. గతేడాది మే చివర్లో విచారణ సందర్భంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు.

రియాజ్‌ సిద్దిఖీ: అబూసలేం ఆయుధాలు తరలించేందుకు వాహనాన్ని సమకూర్చటంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు సహాయంగా వెళ్లాడు.

కరీముల్లా ఖాన్‌: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో దాచిన ఆయుధాలు, డిటోనేటర్లు, గ్రనేడ్లను  సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దుబాయ్‌ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ శిక్షణ పొందాడు.

ముంబై పేలుళ్ల కేసు ముఖ్యాంశాలు
  బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌లు ముంబైలో వరుస బాంబుపేలుళ్లకు కుట్ర పన్నారు. 1993 మార్చి 12వ తేదీన ముంబై బాంబులతో దద్దరిల్లింది. ఆర్డీఎక్స్‌ను పేలుళ్లకు ఉపయోగించారు. ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో... మొత్తం 13 చోట్ల బాంబులను పేల్చారు. ఈ పేలుళ్లలో 257 మంది చనిపోగా, 713 మంది గాయపడ్డారు.
  మొత్తం 189 మందిపై అభియోగాలు నమోదు కాగా.. విచారణ ఆరంభంలోనే 26 మందిని టాడా ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. తర్వాత మరో నలుగురిని వేర్వేరు కోర్టులు నిర్దోషులుగా ప్రకటించాయి.
  నిందితుల్లో 35 మంది పరారీలో ఉన్నారు. వారిలో దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్, మహ్మద్‌ అహ్మద్‌ ఉమర్‌ దోసా ముఖ్యులు.
పేలుళ్ల కుట్రకు వ్యూహం రచించినప్పటినుంచీ.. ఆర్డీఎక్స్, ఆయుధాల అక్రమ రవాణా, బాంబులు అమర్చే వారిని గుర్తించి వారికి పని అప్పజెప్పడం, డబ్బులు ముట్టజెప్పడం దాకా అన్నింటినీ టైగర్‌ మెమన్‌ పర్యవేక్షించాడు. పేలుళ్ల తర్వాత దుబాయ్‌కి పారిపోయాడు. ఇతని సోదరుడు, సహనిందితుడు యాకూబ్‌ మెమన్‌ను 2015 జులై 30న ఉరితీశారు.

టైమ్‌లైన్‌:
12 మార్చి, 1993: గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి, 713 మందికి గాయాలు.
19 ఏప్రిల్, 1993: ఏకే–56 రైఫిల్‌ను, 9ఎంఎం పిస్టల్‌ను, తుటాలను అక్రమంగా కలిగి ఉన్నాడనే అభియోగంపై సినీనటుడు సంజయ్‌దత్‌ అరెస్టు. 15 రోజులకే బెయిల్‌పై విడుదల.
4 నవంబరు 1993: ముంబై క్రైంబ్రాంచ్‌ ప్రాథమిక చార్జిషీట్‌ దాఖలు. 189 మందిపై అభియోగాలు. 117వ నిందితుడిగా సంజయ్‌దత్‌.
19 నవంబరు 1993: ఈ కేసు సీబీఐకి అప్పగింత.
10 ఏప్రిల్‌ 1994: 26 మందిని నిర్దోషులుగా తేల్చిన టాడా కోర్టు.
ఏప్రిల్‌ 1995 – సెప్టెంబరు 2003: టాడా కోర్టులో విచారణ. అప్రూవర్లుగా మారిన నిందితులు మహ్మద్‌ జమీల్, ఉస్మాన్‌ జానకనన్‌.
జూన్‌ 13 2003: అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురు నిందితులను ప్రధాన కేసునుంచి వేరుచేసి.. విచారణ జరపాలని కోర్టు నిర్ణయం.
సెప్టెంబరు 12, 2006: టాడా కోర్టు తీర్పు. యాకూబ్‌ మెమన్‌తో సహా 12 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు
31 జులై, 2007: సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలుశిక్ష
21 మార్చి 2013: యాకూబ్‌ మెమన్‌కు మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీం. మరో 10 మంది మరణశిక్ష.. యావజ్జీవ కారాగారశిక్షగా మార్పు.
29 జులై, 2015: యాకూబ్‌ మెమన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.
30 జులై, 2015: నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో యాకూబ్‌ మెమన్‌కు ఉరి అమలు
25 ఫిబ్రవరి, 2016: సత్ప్రవర్తన కారణంగా 8 నెలల శిక్ష తగ్గి జైలునుంచి సంజయ్‌దత్‌ విడుదల.
16 జూన్, 2016: అబూసలేంతో సహా మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చిన టాడా కోర్టు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు