పిడుగుల కారణంగా.. 2,297 మంది మృతి..!

9 Sep, 2016 14:42 IST|Sakshi
పిడుగుల కారణంగా.. 2,297 మంది మృతి..!

భువనేశ్వర్ః ప్రకృతి ఉత్పాతాలతో ఒడిషా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. ముఖ్యంగా గత ఏడు సంవత్సరాల కాలంలో కేవలం పిడుగుల థాటికి వేల సంఖ్యలో జనం మృతి చెందడం రాష్ట్రంలో ఆందోళన రేపుతోంది. మిగిలిన ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే మృతులతో పోలిస్తే పిడుగుల కారణంగానే జనం అధికంగా చనిపోతున్నట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది.

గడచిన ఏడు సంవత్సరాల్లో ఒడిషాలో పిడుగుల కారణంగా 2,297 మంది మృతి చెందారు. సగటున సంవత్సరానికి 327 మంది వరకూ పిడుగుల కారణంగా మరణించినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ఇచ్చిన నివేదిక చెప్తోంది. ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు 284 మంది ఇప్పటివరకూ మరణించినట్లు నివేదికను బట్టి తెలుస్తోంది. మృతుల్లో ముఖ్యంగా 56 మంది వరకూ ఆగస్టు మొదటి వారంలో పడ్డ పిడుగుల కారణంగా చనిపోయినట్లు నివేదిక పేర్కొంది. అయితే చనిపోయినవారిలో ఎక్కువశాతం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రకృతి వైపరీత్యాలపై సకాలంలో హెచ్చరికలు జారీ చేసే అధికారులకు సైతం.. పిడుగులు పెద్ద సమస్యగా మారాయి. ఉన్నట్లుండి ముంచుకొచ్చే పిడుగు థాటిని అంచనా వేయడం సాధ్యంకాదని అధికారులు అంటున్నారు. అయితే  వాతావరణం మారి, మెరుపులు వచ్చే సమయంలో చేయాల్సిన, చేయకూడని విషయాలపై జిల్లాలకు తగిన సలహాలను జారీ చేసేందుకు నిర్ణయించినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్తా కుమార్ మహాపాత్రా తెలిపారు. వార్తాపత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం తప్పించి.. పిడుగుల వల్ల కలుగుతున్న నష్టానికి మరో పరిష్కార మార్గం కనిపించడం లేదని ఆయన తెలిపారు. పిడుగులను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం నిబంధనల మేరకు మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నట్లు మహాపాత్రా తెలిపారు.

2010-11 సంవత్సరాల్లో 281 మంది, 2011-12 లో 355 మంది, 2012-13 లో 293 మంది, 2013-14 లో 372 మంది పిడుగుల కారణంగా మృతి చెందగా... 2014-15 లో 308 మంది, 2015-16 లో 399 మంది, 2016-17 ఆగస్లు నెలవరకూ 284 మంది పిడుగుల థాటికి మృతి చెందినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది.

మరిన్ని వార్తలు