వారికి బంకర్లే రక్షణ..!

24 Aug, 2014 02:25 IST|Sakshi
వారికి బంకర్లే రక్షణ..!

జమ్మూకాశ్మీర్ పల్లె ప్రజల దుస్థితి.. పాక్ కాల్పుల మోతతో భయంభయంగా గడుపుతున్న కాశ్మీరీలు..
 న్యూఢిల్లీ: ఇరుకు బంకర్లలో పిల్లలను హత్తుకుని బిక్కుబిక్కుమంటున్న తల్లులు.. ఎప్పుడేం జరుగుతుందోనని భయంభయంగా ఊరివైపు చూస్తున్న తండ్రులు.. కాస్త దూరంలో చెవులు చిల్లులు పడేలా బాంబు పేలుళ్లు.. కాల్పుల మోతలు..! కూలిన ఇళ్లు, క్షతగాత్రుల హాహాకారాలు.. ! ఇదంతా ఏ గాజాలోనో, అఫ్ఘానిస్థాన్‌లోనో, ఇరాక్‌లోనో కనిపించే దృశ్యమనుకుంటే పొరపడినట్లే! ఇది.. సాక్షాత్తూ భారతావని శిరస్సులాంటి జమ్మూ కాశ్మీర్‌లో కనిపిస్తున్న అనుదిన వ్యథాభరిత చిత్రం..!!
 
కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో రెండు వారాలుగా పాక్ బలగాలు జరుపుతున్న కాల్పులు అక్కడి గ్రామాల ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. కాల్పుల్లో శనివారం వరకు ముగ్గురు కాశ్మీరీలు మృతిచెందగా, పదిమందికిపైగా గాయపడ్డారు. పాక్ కాల్పులకు భయపడి వందలాది ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఆర్‌ఎస్ పురా సెక్టార్ త్రేవా గ్రామ ప్రజలను దగ్గర్లోని బంకరే ఆదుకుంటోంది. దాదాపు పదిమంది మాత్రమే పట్టే ఈ ఇరుకు బంకర్‌లో మహిళలు, పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.
 
 భోజనం చేయగానే అక్కడికి వెళ్తున్నారు. సరిహద్దులోని పలు గ్రామాల ప్రజలు పదేళ్ల కిందట వాడి వదిలేసిన బంకర్లను శుభ్రం చేసి వాడుకుంటున్నారు. పొదలు, గుట్టల మధ్యలో ఉన్న వీటి ప్రవేశమార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఒకరి వెనుక ఒకరు లోనికి వెళ్లాల్సిన పరిస్థితి! పాక్ వైపు నుంచి ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని కరోతోంటా ఖుర్ద్ గ్రామవాసి ఓమ్ ప్రకాశ్ చెప్పారు. 2003లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తుండడంతో దానికి కాలం చెల్లిపోయినట్లేనని స్థానికులు అంటున్నారు. సరిహద్దు ఘర్షణలు ఇరు దేశాల మధ్య సాగుతున్న శాంతి చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.

మరిన్ని వార్తలు