ఆ అగ్ని ప్రమాదంలో ఇద్దరు హీరోలు...

30 Dec, 2017 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముంబై నగరం, కమలామిల్స్‌లోని రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌లో గురువారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పుట్టిన రోజు జరుపుకుంటున్నఅమ్మాయితో పాటు ఆ వేడుకలకు హాజరైన అతిథుల్లో 14 మంది దుర్మరణం చెందిన విషయం తెల్సిందే. పక్క భవనంలో పనిచేస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు సకాలంలో అప్రమత్తమై సహాయ సహకారాలు అందించకపోతే ప్రాణ నష్టం భారీగా జరిగేదని తెల్సింది. పక్క భవనంలోని టైమ్స్‌నౌ కార్యాలయంలో సర్వర్‌ గదిలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న మహేశ్‌ సాబ్లీ, సురజ్‌ గిరి అగ్ని ప్రమాదం నుంచి దాదాపు 150 మందిని రక్షించారు.
 
రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌ కలిగిన నాలుగంతస్తుల భవనంలో మంటలు రాజుకోవడం దాదాపు అర్థరాత్రి సమయంలో ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గమనించారు. సూరజ్‌ తక్షణమే అగ్నిమాపక దళానికి ఫోన్‌ చేయగా, మహేశ్‌ నాలుగో అంతస్తు వరకు పైపులు పట్టుకొని ఎక్కి అక్కడి ఎగ్జిట్‌ డోర్‌ను పగులగొట్టి మంటల్లో చిక్కుకున్నవారు రక్షించుకోవడానికి దోహదపడ్డారు.

ఈలోగా అగ్నిమాపక దళానికి ఫోన్‌చేసిన సూరజ్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌కు వెళ్లి భవనం నుంచి బయటకు వెళ్లే దారులను తెరిచి తొక్కిసలాట జరుక్కుండా బాధితులకు దారిచూపారు. దట్టమైన పొగతో ఒకరికొకరు కనిపించని స్థితిలో ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చేసిన సహాయం ఎంతో ఉపయోగపడింది. అనంతరం ప్రాణాలతో బయటపడిన బాధితులు వారిరువుకి కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కృషిని అగ్నిమాపక సిబ్బంది, మీడియా ప్రశంసించింది. 

మరిన్ని వార్తలు