ఆటో రిక్షాను ఢీకొట్టిన రైలు

19 Aug, 2014 02:28 IST|Sakshi
ఆటో రిక్షాను ఢీకొట్టిన రైలు

బీహార్‌లోని తూర్పుచంపారన్‌లో ఘోర రైలు ప్రమాదం
ఎనిమిది మంది చిన్నారులు సహా 20 మంది మృతి
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే

 
పాట్నా, మోతిహరి(బీహార్): బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రాప్తి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు చంపారన్ జిల్లాలోని సెమ్రా, సుగౌలి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోరిక్షా రైల్వే గేట్‌ను దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా చినౌతా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సమీప గ్రామంలోని ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి వీరంతా తిరిగి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

గేట్ మెన్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ జరుపనున్నట్టు తెలిపారు. వేగంగా వచ్చిన రాప్లి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు చినౌతా గ్రామానికి సమీపంలోని క్రాసింగ్ దగ్గర కిక్కిరిసిన జనంతో ఉన్న ఆటోను ఢీ కొట్టిందని తూర్పు ఛంపారన్ జిల్లా ఎస్‌పీ సుధీర్‌కుమార్ వెల్లడించారు. సుమారు 50 మీటర్ల దూరం వరకూ రైలు ఆటోను ఈడ్చుకుపోయిందని, దీంతో పలువురి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని చెప్పారు. రైలు ప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. రైల్వే శాఖ మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారంగా ప్రకటించింది.

కాగా, బీహార్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. ప్రమాదానికి బాధ్యులుగా భావించి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెమ్రా సూపరింటెండెంట్, లెవల్ క్రాసింగ్ వద్ద  ఉన్న గేట్‌మెన్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌లను సస్పెండ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు