తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌: 20 మంది సిబ్బంది తొలగింపు

28 Nov, 2019 15:54 IST|Sakshi

న్యూఢిల్లీ: తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌కు సేవలందిసున్న ఒక ప్రైవేటు సంస్థకు చెందిన 20 మంది ఉద్యోగులను బుధవారం ఎటువంటి నోటీసులివ్వకుండానే విధుల నుంచి తొలగించారు. తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌కు వివిధ విభాగాల్లో క్యాబిన్ సిబ్బంది, అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న తమను తొలగించడంతో సహయం కోరుతూ వారంతా గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ట్వీట్‌ చేశారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఏకధాటిగా 18 గంటలపాటు విధులు నిర్వర్తించే తమకు యాజమాన్యం కనీసం నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్‌ రైలుగా పేరున్న తేజస్‌ ఎక్స్‌ప్రెస్ లక్నో- న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది‌. తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తోంది. 

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌కు సేవలందించే కొన్ని విభాగాల్లో అవసరానికి మించి సిబ్బంది ఉన్న కారణంగా.. కొంతమందిని తప్పించినట్లు ఐఆర్‌సీటీసీ వర్గాలు తెలిపాయి. కాగా తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌కు సేవలందిస్తున్న బృందావన్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌ అనే ప్రైవేటు సంస్థ ఢిల్లీకి చెందింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలైన తేజస్ ఎక్స్‌ప్రెస్ గంటకు పైగా ఆలస్యం అయితే రూ. 100 పరిహారం, రెండు గంటలకు పైగా ఆలస్యం అయినట్లయితే రూ. 250 పరిహారంగా ఇస్తుంది. 

మరిన్ని వార్తలు