‘సర్ జేజే’ విస్తరణకు శ్రీకారం

5 Jul, 2014 23:46 IST|Sakshi
‘సర్ జేజే’ విస్తరణకు శ్రీకారం

- మరో 200 ప్రైవేట్ గదుల నిర్మాణానికి నిర్ణయం
- రూ. 600 కోట్లు ఖర్చుకానున్నట్లు అంచనా

సాక్షి, ముంబై : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్ జేజే గ్రూప్ ఆస్పత్రుల పరిపాలనా విభాగం  కొత్త సూపర్ స్పెషాలిటీ  బిల్డింగ్ ప్రాజెక్టులో భాగంగా మరో 200 ప్రైవేట్ గదులను నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకు రూ.650 కోట్లు ఖర్చు కానున్నట్లు సంబంధిత అధికారి శనివారం వెల్లడించారు. ఆగ్నేయ ఆసియాలోనే ఈ జేజే ఆస్పత్రి అతి పురాతనమైన, అతి పెద్దదైన ఆస్పత్రిగా పేరు గడించింది. 1,352 పడకల ఈ ఆస్పత్రిని సర్ జెమ్‌షెట్‌జీ జీజీభాయ్ 150 ఏళ్ల కిందట నిర్మించారు.

కొత్త భవనాన్ని నిర్మించే ముందు పురాతన రెండు భవనాలను కూల్చాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్లను కూడా ఆహ్వానించా మన్నారు. డిసెంబర్‌లో   పనులు ప్రారంభిస్తామని చెప్పారు.  చాలా రోజులుగా ఇక్కడ మరిన్ని ప్రైవేట్ గదుల నిర్మాణం చేపట్టాల్సిందిగా రోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోందని వారు తెలిపారు. ఆస్పత్రి డీన్ టి.పి.లహానే మాట్లాడుతూ సూపర్‌స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్ భవనం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైందని తెలిపారు.

ప్రణాళిక ప్రకారం ఆస్పత్రి ఆవరణలో ఎనిమిది అంతస్తులు గల రెండు భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక భవనంలో దాదాపు 200 ప్రైవేట్ రూంలను నిర్మిస్తామన్నారు. ఈ గదుల అద్దె రూ.రోజుకు 500 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర ప్రైవేట్ ఆస్పత్రులతో పోల్చితే ఇది చాలా చౌకగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 30 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

16 ఆపరేషన్ థియేటర్లతోపాటు 38 డిపార్ట్‌మెంట్లు, రోజూ హాజరయ్యే 2,500 ఓపీడీ రోగుల కోసం కేటాయించనున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు 1,100 అడ్మిషన్లు, 200 శస్త్రచికిత్సలు జరుగుతాయని తెలిపారు.  కొన్ని ఏళ్లుగా ఆస్పత్రి తీవ్రమైన స్థల కొరత సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను ఛేదించేందుకు పరిపాలనా విభాగం ఇటీవలే పాత ఖైదీల వార్డును ఉపయోగించుకునేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు