లాక్‌డౌన్‌ : తిండిలేక 200 కుక్కలు మృతి

4 May, 2020 19:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా తాగడానికి నీరు, సరైన తిండి లేక ముంబై, థానే, నవీ ముంబైలలో దాదాపు 200 కుక్కలు మృత్యువాత పడ్డాయని ‘సేవ్‌ ది పాస్‌’ అనే ఎన్జీఓ సంస్థ తెలిపింది. అరకొరగా దొరుకుతున్న ఆహారం కోసం కుక్కలు విపరీతంగా కలబడుతున్నాయని, ఈ కొట్లాటల కారణంగా కుక్కపిల్లలు చనిపోతున్నాయని పేర్కొంది. గత వారం ఆహారం తింటున్న తొమ్మిది కుక్కపిల్లలను ఓ పెద్ద కుక్క కొరికి చంపి, ఆహారం ఎత్తుకెళ్లిందని తెలిపింది. సేవ్ ది‌ పాస్‌ ఫౌండర్‌ పూనమ్‌ గిద్వాని మాట్లాడుతూ.. ‘‘  వీధి జంతువులపై లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. సరిపడా ఆహారం వాటికి దొరకటం లేదు. లక్షల వీధి జంతువులు మార్కెట్లు, రెస్టారెంట్లు, సరుకుల దుకాణాల వ్యర్థాలపై ఆధారపడి బ్రతుకుతున్నాయి. ( అత్యధిక కరోనా మరణాల రేటు ఆ రాష్ట్రంలోనే )

జనాలు ఇళ్లకు పరిమితం కావటంతో వీధి జంతువులకు గడ్డుకాలం ఏర్పడింది. మిల్క్‌ కాలనీ, ఫిల్మ్‌ సిటీలలో ఆకలి బాధతో పిల్లులు, కుక్కలు ఎక్కువగా చనిపోతున్నాయి. కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లకు ఆదాయ మార్గాలు లేక ఇబ్బందులు పడుతున్నార’’ని వెల్లడించారు. కాగా, బాలీవుడ్‌ ప్రముఖులు రోహిత్‌ శెట్టి, ఫరాఖాన్‌, ప్రీతి సిమోఎస్‌లు ‘సేవ్‌ ది పాస్‌’ ద్వారా వీధి జంతువుల ఆకలి తీరుస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు