వీహెచ్పీ నాయకురాలు సాధ్వి ప్రాచి ముజఫర్నగర్లోని ఓ కోర్టులో లొంగిపోయారు. 2013 నాటి ముజఫర్నగర్ అల్లర్ల కేసులో ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో వరుసగా వారంట్లు రావడంతో ఆమె కోర్టుకు వెళ్లి రూ. 20వేల బాండును సమర్పించి, తదుపరి విచారణకు వస్తానని హామీ ఇవ్వడంతో ఆమెపై జారీచేసిన బెయిలబుల్ వారంటును కోర్టు ఉపసంహరించుకుంది. ఇంతకుముందు డిసెంబర్ 18న ఓసారి, జనవరి 23న మరోసారి సాధ్వి ప్రాచిపై కోర్టు వారంట్లు జారీచేసింది.
ఇదే కేసులో గత సంవత్సరం డిసెంబర్ నెలలో కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్, బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాణా, బీజేపీ ఎంపీ భరతేందు సింగ్, మరో నలుగురు కోర్టులో లొంగిపోయారు. మరో ఎమ్మెల్యే సంగీత్ సోమ్ జనవరి 19న లొంగిపోయారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, ప్రభుత్వోద్యోగులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం లాంటి కేసులు ఈ నేతల మీద ఉన్నాయి. 2013 ఆగస్టు నెలలో ముజఫర్నగర్లో జరిగిన ఓ సమావేశంలో వీళ్లు పాల్గొని, తమ ప్రసంగాల ద్వారా హింసను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన మతఘర్షణలలో 60 మంది మరణించగా, 40 వేల మంది నిర్వాసితులయ్యారు.