రాజ్యసభలో పుంజుకోనున్న బీజేపీ

7 Jan, 2018 02:34 IST|Sakshi

ఈ ఏడాది 67కు పెరగనున్న సీట్లు

57 నుంచి 48 పడిపోనున్న కాంగ్రెస్‌ బలం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లుల్ని పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుని తన ప్రతిష్ట పెంచుకోవాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. రాజ్యసభలో తగినంత సంఖ్యా బలం లేకపోవడం బీజేపీకి ఇబ్బందిగా మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై రాజ్యసభలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బలం పెంచుకునే అంశంపై బీజేపీ దృష్టి పెట్టిందని  ఆ పార్టీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి బాలసుబ్రమణియమ్‌ చెప్పారు.  2018 ద్వితీయార్థానికల్లా రాజ్యసభలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. ప్రస్తుతమున్న 57 మంది సభ్యుల బలం 67కి చేరుతుంది. 244 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బలం 98కి చేరువకానుంది.

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి ఆ పార్టీ లాభపడనుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు రాజ్యసభలో 57 మంది ఎంపీలుండగా.. జూలైకు ఆ బలం 48కి పడిపోనుంది. యూపీఏ కూటమి ఎంపీలు 72 నుంచి 63 తగ్గనున్నారు. బడ్జెట్‌ సమావేశాల నాటికి బీజేపీ బలం 58కి పెరగనుండగా.. కాంగ్రెస్‌ బలం 54కి పడిపోనుంది.  కాంగ్రెస్‌ తర్వాత రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ నష్టపోనుంది. ఆ పార్టీ ఐదు స్థానాలు కోల్పోనుండగా.. ఆర్జేడీ బలం మూడు నుంచి ఐదుకు పెరుగుతుంది. రాజ్యసభ ఉప ఎన్నికలు, ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలపై ఈ మార్పులు చేర్పులు ఆధారపడి ఉన్నాయి. ఇక ఏప్రిల్‌లో ద్వై వార్షిక ఎన్నికల్లో 59 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. యూపీలో 10 స్థానాలకు ఎన్నిక జరగనుండగా 8 స్థానాలు బీజేపీ సొంతం కానున్నాయి.

మరిన్ని వార్తలు