2027 నాటికి మనమే టాప్‌

18 Jun, 2019 13:07 IST|Sakshi

2027 నాటికి భారత్‌ టాప్‌లోకి - యూఎన్‌ నివేదిక

చైనాకు వెనక్కినెట్టి మరీ టాప్‌లోకి భారత్‌

పెరుగుతున్న వృధ్దుల సంఖ్య

2.2 శాతం తగ్గనున్న చైనా జనాభా

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశం జనాభా పరంగా త్వరలోనే  చైనాను అధిగమించనుందట.  ప్రస్తుతం టాప్‌లో ఉన్న చైనాను వెనక్కి నెట్టి ఇండియా ముందుకు  దూసుకురానుంది.  రెండవ స్థానంలో ఉన్న  భారత్‌ 2027 నాటికి  మొదటి స్థానంలో నిలవనుందని  ఐక్యరాజ్య సమితి తాజా  నివేదికలో అంచనా వేసింది.  అంతేకాదు 2050 నాటికి 27 కోట్ల (273 మిలియన్ల)కు పైగా జనాభా  పెరగడంతో ప్రస్తుత శతాబ్దం చివరి నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుందని యుఎన్ నివేదిక వెల్లడించింది.

ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల జనాభా విభాగం 'ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్‌-2019’ పేరుతో ఈ నివేదికను ప్రచురించింది. రాబోయే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా రెండు బిలియన్లు వృద్ది చెంది,  ప్రస్తుతం 7.7 బిలియన్ల నుండి 9.7 బిలియన్ల స్థాయికి చేరుతుందని  పేర్కొంది. 

ప్రపంచ జనాభా ప్రస్తుత శతాబ్దం చివరినాటికి దాదాపు 11 బిలియన్ల స్థాయికి చేరుకోగలదని తెలిపింది. ఈ పెరుగుదలలో సగం కంటే ఎక్కువ పెరుగుదల  భారత్‌సహా తొమ్మిది దేశాలలో (నైజీరియా, పాకిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్ట్, అమెరికా) కేంద్రీకృతమై ఉంటుందని యూఎన్‌ సర్వే తేల్చింది. 2019 -2050 భారతదేశం దాదాపు 1.5 బిలియన్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది.  చైనా 1.1 బిలియన్లతో, నైజీరియా 733 మిలియన్లతో, యుఎస్ 434 మిలియన్లతో, పాకిస్తాన్ 403 మిలియన్ల జనాభాతో తరువాతి స్థానాల్లో ఉండనున్నాయి.  అంతేకాదు ఆయుర్దాయం పెరగడం, సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోవడంతో ప్రపంచ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని,  జనాభాను తగ్గించుకునేందుకు వివిధ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇందుకు కారణమని నివేదిక ధృవీకరించింది.

2050 నాటికి, ప్రపంచంలోని ఆరుగురిలో ఒకరు 65 ఏళ్లు (16శాతం ) పై బడి ఉంటారు.  2019లో 11 మందిలో ఒకరు (9శాతం). 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు ఉంటుందని అంచనావేసింది.  2019 లో 143 మిలియన్ల నుంచి 2050 లో 426 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది.  ఇక అభివృద్ది చెందుతున్న దేశాల్లో శిశు మరణల రేటు తగ్గు ముఖం పట్టడంతో పాటు మనిషి జీవన ప్రమాణ రేటు కూడ పెరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో  సగటున ప్రతి మహిళ 2.1 శాతం పిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదించింది. అటు మనిషి  సగటు ఆయువు ప్రమాణం 74 సంవత్సరాలు ఉండగా అది 2050 కల్లా 77 సంవత్సరాలకు పెరగనుంది తెలిపింది. 

మరోవైపు చైనాలో జనాభా 2019 -2050 మధ్య కాలంలో 31.4 మిలియన్లు లేదా 2.2 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. కాగా 2017 ప్రపంచ జనాభా నివేదిక ప్రకారం భారతదేశ జనాభా 2024 నాటికి చైనా జనాభాను అధిగమిస్తుందని అంచనా వేసింది. 


 

మరిన్ని వార్తలు