అత్తల కనుసన్నల్లో పల్లెపడుచులు

11 Dec, 2019 04:39 IST|Sakshi

పల్లె మహిళ ప్రగతిపై కుటుంబ ఆంక్షల ప్రభావం

సామాజిక సంబంధాల్లో మెరుగైన స్థితిలో పట్టణ మహిళలు

సామాజిక సంబంధాలపై అత్తల ఆంక్షలు
దేశంలోని గ్రామీణ ప్రాంతాల మహిళలు కనీస వ్యక్తిగత విషయాల్లోనూ స్వేచ్ఛగా వ్యవహరించలేకపోతున్నారట. గ్రామీణ మహిళలు తమ కుటుంబాలకు మాత్రమే పరిమితం అయిపోవడానికి అత్తల పెత్తనమే కారణమని బోస్టన్‌ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అత్తల పెత్తనానికి కూడా వారిలోని పురుషాధిపత్య భావజాలమే కారణమని గుర్తించింది. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల మహిళలు పునరుత్పత్తి, కుటుంబ నియంత్రణ విషయాల్లో మెరుగ్గా ఉండడానికి వారికున్న సోషల్‌ మొబిలిటీ, సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండడమే కారణమని ఈ సర్వే పేర్కొంది. – న్యూఢిల్లీ

కర్స్‌ ఆఫ్‌ ద మమ్మీజీ 
బోస్టన్‌ యూనివర్సిటీకి చెందిన మహేష్‌ కర్రా, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీకి చెందిన కాటలీనా హెర్రేరా అల్మాంజా, బోస్టన్‌ కాలేజీకి చెందిన ఎస్‌.అనుకృతి, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రవీణ్‌ పాఠక్‌లు ‘కర్స్‌ ఆఫ్‌ ద మమ్మీజీ’(అత్తల కనుసన్నల్లో) పేరుతో పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు. అధ్యయనంలో భాగంగా 2018లో ఉత్తరప్రదేశ్‌లో 18– 30 ఏళ్ల మధ్య వయస్సు గ్రామీణ వివాహితల ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. మహిళల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణపై సామాజిక సంబంధాల ప్రభావంపై ఈ అధ్యయనంలో గుర్తించిన కీలకాంశాలు..

►గ్రామీణ స్త్రీ తన కుటుంబంలోని భర్త, అత్త కాకుండా సగటున తమ జిల్లాలోని 1.6 మంది వ్యక్తులతో మాత్రమే వ్యక్తిగత విషయాలను చర్చిస్తున్నారు. 
►సగటున ఒకరికన్నా తక్కువ 0.7 వ్యక్తులతో వ్యక్తిగత, గోప్యతాంశాలపై మాట్లాడుతున్నారు. 
►గ్రామీణ స్త్రీలలో 36 శాతం మందికి తమ ప్రాంతంలోని అన్ని రకాల విషయాలూ చర్చించుకోగలిగే ఒక్క సన్నిహిత వ్యక్తి కూడా లేరు. 
►22 శాతం మందికి జిల్లాలోనే కాకుండా మరెక్కడా సన్నిహితమైన వ్యక్తులు లేరు. 
►14 శాతం స్త్రీలకు మాత్రమే ఒంటరిగా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు అనుమతి ఉంది. 
►12 శాతం మంది స్త్రీలకు అదే గ్రామంలోని బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లే అనుమతి ఉంది.

గ్రామీణ స్త్రీల సామాజిక సంబంధాలపై అత్తల ప్రభావం ఎక్కువగా ఉంది. కోడళ్లు కనీసం గడపదాటి బయటకు వెళ్లాలన్నా చాలా ఇళ్లలో అత్తల అనుమతి తప్పనిసరి. తమకున్న పరిమిత సన్నిహితుల రీత్యా వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ వారు చర్చించే అవకాశాల్లేవు. దీంతో పిల్లల్ని కనడం,, కుటుంబ నియంత్రణ విషయాల్లో కోడళ్ల ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా అత్తల నిర్ణయాలే అమలవుతున్నాయి.

ఆధునిక కుటుంబ నియంత్రణకు 21.4 కోట్ల మంది దూరం 
అత్తలతో కలిసి జీవించని స్త్రీలతో పోల్చుకుంటే అత్తలతో ఉండేవారు కుటుంబ నియంత్రణ కోసం 50 శాతం తక్కువగా ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. అత్తలతో జీవించడం వల్ల ఆధునిక గర్భనిరోధక పద్ధతులను అనుసరించేవారు 12.5 శాతం వరకు తగ్గారు. 2018 ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 21.4 కోట్ల మంది స్త్రీలు ఆధునిక కుటుంబ నియంత్రణా పద్ధతులను అవలంభించడం లేదు.

పట్టణ స్త్రీలు సామాజిక సంబంధాలు, సామాజిక మాధ్యమాల కారణంగా ఈ విషయంలో గ్రామీణ స్త్రీల కంటే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఈ అధ్యయనం గుర్తించింది. గ్రామీణ స్త్రీలు అత్తల కనుసన్నల్లో మెలగాల్సి రావడం వారి పునరుత్పత్తి హక్కులను ప్రభావితం చేస్తోంది. వీరు తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సందిగ్ధంలో పడిపోతున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లిగానీ, ఇతర కుటుంబ సభ్యులతోగానీ వ్యక్తిగత విషయాలను చర్చించే వేదికే కరువైన స్థితిలో వారు ఉన్నారు. పైపెచ్చు, సంతానోత్పత్తికి సంబంధించి పురుషుల్లో సమస్య ఉంటే, దాన్ని సైతం అత్తలు బయటపడకుండా గోప్యంగా ఉంచుతున్నారని ఈ అధ్యయనంలో గుర్తించారు.

ఎందుకీ ఆధిపత్యం?
అత్తాకోడళ్ల మధ్య పరస్పర విరుద్ధ భావాలు ఈ అవరోధానికి కారణం. అయితే, ఇందుకు మూల కారణం మాత్రం అత్తల్లోని పురుషాధిపత్య ధోరణేనంటున్నారు అధ్యయనవేత్తలు. ఇవే అత్తల్లోని ఆధిపత్య ధోరణికీ, పెత్తందారీ పోకడలకీ, తమ మాటే చెల్లుబాటు కావాలనే మొండి పట్టుదలకు కారణాలని అధ్యయనం వెల్లడించింది. అత్తలతో లేని వివాహితలు చాలా విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. పురుషాధిపత్య భావజాలం ప్రభావంలో ఉన్న అత్తల ఆధిపత్యం యువతుల అభివృద్ధికి అడ్డుకట్టగా నిలుస్తోందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

మరిన్ని వార్తలు