ఇకపై ప్రతి మంగళవారం..

1 Nov, 2014 23:58 IST|Sakshi

మంత్రి మండలి సమావేశాలపై సీఎం ఫడ్నవీస్
సాక్షి, ముంబై: రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలు ఇకపై ప్రతి మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి బుధవారం మంత్రిమండలి సమావేశాలు జరిగేవి. అయితే ఇకపై  సమావేశాలను మంగళవారం నిర్వహించాలని శనివారం  సీఎం ఫడ్నవీస్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో   నిర్ణయించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షించారు. అనంతరం ఆయన డీజీపీతో సమావేశమయ్యారు. ఇటీవల అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దళితుల హత్యపై డీజీపీని అడిగి తెలుసుకున్నారు. వెంటనే విచారణ జరిపించి నివేదికను అందజేయాలని ఆదేశించారు.కాగా, రాష్ట్ర మంత్రి పంకజా ముండే ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
 
సీఎంవో కార్యాలయంలో సమూల మార్పులు

ఇదిలా ఉండగా, సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలుగా సీఎంవో కార్యాలయంలో పలు మార్పులు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయ మార్గంలో సీఎంవో కార్యాలయ పనితీరును మార్చనున్నారు. మంత్రులకు సహాయకులుగా సమర్థులైన అధికారులను నియమించనున్నట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మంత్రుల వద్ద పనులు పెండింగ్‌లో పడిపోకుండా ఈ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. అలాగే స్థానిక సంస్థల పన్ను(ఎల్‌బీటీ) రద్దు, టోల్ ట్యాక్స్‌లపై ప్రశ్నించగా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు