ఒకే ఇంట్లో 23 మంది లాక్‌డౌన్‌!

6 Apr, 2020 08:27 IST|Sakshi
ఇంట్లో ఉన్న వారినుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు

భువనేశ్వర్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఒకే ఇంట్లో ఉంటున్న 23 మందిని ఇంట్లోనే లాక్‌డౌన్‌ చేశారు అధికారులు. ఈ సంఘటన ఒరిస్సాలోని నవరంగపూర్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నవరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయం వెనుక ఉన్న ఇంటిలో 23 మంది వ్యక్తులు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇంటి కుటుంబసభ్యులతో పాటు చత్తీస్‌ఘడ్‌ సుకుమకు చెందిన కొందరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొందరు ఉంటున్నట్లు తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు ప్రజలు లాక్‌డౌన్‌, సామాజిక దూరాలను పాటించాలని ప్రభుత్వం నిర్ధేశించినా.. ఆదేశాలను తుంగలో తొక్కి ఒకే ఇంటిలో 23 మందికి పైగా ఉండటంతో ఆగ్రహించిన అధికారులు ఆ ఇంటిని లాక్‌డౌన్‌ చేశారు. ( ఒకే ఇంట్లో భర్త నుంచి భార్యకు పిల్లలకు.. )

వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటిలోనుంచి బయటకు రాకూడదని ఆదేశించారు. అత్యావసర సరుకులు తామే సమకూర్చుతామని భరోసా ఇచ్చారు. ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో ఒకే ఇంట్లో ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఇంటి పరిసరాలకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు జరిపిన అనంతరం జనజీవనంలోకి అనుమతిస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు