యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

6 Jun, 2017 00:42 IST|Sakshi
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీ, బస్సు ఢీ: 24 మంది సజీవదహనం
►  ప్రమాదంలో బద్ధలైన బస్సు డీజిల్‌ ట్యాంకర్‌.. చెలరేగిన మంటలు

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 41 మందితో వస్తున్న బస్సు.. ఓ లారీని ఢీ కొని అగ్నికి ఆహుతైంది. బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ బద్ధలు కావడంతో మంటలు చెలరేగి.. బస్సు, లారీ కూడా కాలి బూడిదయ్యాయి. అగ్నికీలల్లో చిక్కుకుని 24 మంది సజీవదహనం కాగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బరేలీ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు యూపీఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు 41 మంది ప్రయాణికులతో బయలుదేరింది. జాతీయ రహదారి 24పై బాదా బైపాస్‌ వద్ద బస్సు ఓ లారీని ఢీ కొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు 22 మంది ఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముగ్గురు మాత్రం ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

గుర్తుపట్టలేనంతగా...: మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలులేనంతగా కాలిపోయాయి. బాధితులను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. లారీ, బస్సు ఢీ కొన్న అనంతరం బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ బద్ధలైందని, దీంతో మంటలు వేగంగా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే మరణిం చిన వారిలో మగవారు ఎంతమంది, ఆడవారు ఎంతమందనేది తెలుస్తుందని బరేలీ ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విజయ్‌ యాదవ్‌ చెప్పారు. లారీ డ్రైవర్‌ ప్రమాదం తర్వాత పరారయ్యాడు.

బాధితులకు నష్టపరిహారం
బరేలీ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటిం చారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు