ఉడాన్‌లోకి 325 మార్గాలు

25 Jan, 2018 02:41 IST|Sakshi

రెండో విడత రూట్లను విడుదల చేసిన ప్రభుత్వం

కొత్తగా 56 విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌లకు విస్తరించిన పథకం

హైదరాబాద్‌ నుంచి 5, తిరుపతి నుంచి 2 మార్గాలకు చోటు

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విమానయాన రంగం భారీ విస్తరణకు ప్రభుత్వం మరో సానుకూల చర్య తీసుకుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలను మరింత పెంచేలా కొత్తగా 325 మార్గాలను ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం కిందకు తీసుకొచ్చింది. ఉడాన్‌ రెండో విడతలో భాగంగా కొత్తగా 56 విమానాశ్రయాలు/హెలిప్యాడ్‌లను ప్రభు త్వం ఈ పథకం కిందకు చేర్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ అనుసంధాన పథకమైన ఉడాన్‌ కింద రెండో రౌండ్‌ బిడ్డింగ్‌ ముగిసిన అనంతరం విమానయాన సంస్థలకు కేటాయించిన మార్గాలను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు బుధవారం వెల్లడించారు.

మొత్తం 15 సంస్థలకు ఈ మార్గాలను కేటాయించారు. కొత్త మార్గాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి నగరాలకు కూడా వివిధ ప్రాంతాల నుంచి విమానాలు రానున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని యుద్ధభూమి కార్గిల్‌కూ ఉడాన్‌ రెండో విడతలో చోటు దక్కింది. అత్యధికంగా ఇండిగో సమర్పించిన 20 ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. స్పైస్‌జెట్‌ ప్రతిపాదనల్లో 17 ఆమోదం పొందాయి. రోడ్డు, రైలు మార్గాలు సరిగా లేని ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత నగరాలకు ప్రాధాన్యతనిస్తూ ఉడాన్‌ పథకం రెండో విడతలో వాటికే ఎక్కువ మార్గాలను కేటాయించారు.

విమానయాన సంస్థలు 50 శాతం సీట్లను కచ్చితంగా ఉడాన్‌ పథకానికి కేటాయించాలి. ఆ సీట్లకు గంట ప్రయాణానికి రూ.2,500 కన్నా ఎక్కువ చార్జీలను వసూలు చేయకూడదు. అదే హెలికాప్టర్లు అయితే 13 సీట్లను కేటాయించి, అర్ధగంట ప్రయాణానికి గరిష్టంగా రూ.2,500 మాత్రమే వసూలు చేయాలి. రాయితీ కింద ప్రభుత్వం సంస్థలకు కొంత మొత్తం చెల్లిస్తుంది. మొత్తంగా రూ.620 కోట్లను ఇందుకోసం ప్రభుత్వం కేటాయించింది. రెండో విడత మార్గాలు ఆరు నెలల్లోపే అందుబాటులోకి వస్తాయని అశోక్‌ గజపతి రాజు చెప్పారు. గతేడాది మార్చిలో ఉడాన్‌ పథకం తొలిరౌండ్‌ బిడ్డింగ్‌ జరగ్గా మొత్తం 128 మార్గాలను అప్పట్లో ఈ పథకం కింద వివిధ విమానయాన సంస్థలకు కేటాయించడం విదితమే.  

తెలుగు రాష్ట్రాల నుంచి నూతన మార్గాలు
మార్గం                                    విమానయాన సంస్థ
హైదరాబాద్‌–హుబ్లీ                    టర్బో ఏవియేషన్, అలయన్స్‌ ఎయిర్, స్పైస్‌జెట్‌
హైదరాబాద్‌–కొల్హాపూర్‌               ఇండిగో, అలయన్స్‌ ఎయిర్‌
హైదరాబాద్‌–నాసిక్‌                    అలయన్స్‌ ఎయిర్, స్పైస్‌జెట్‌
హైదరాబాద్‌–షోలాపూర్‌               అలయన్స్‌ ఎయిర్‌
హైదరాబాద్‌–కొప్పళ్‌                   టర్బో ఏవియేషన్‌
తిరుపతి–కొల్హాపూర్‌                    ఇండిగో
తిరుపతి–హుబ్లీ                     ఘొడావత్‌ (హెలికాప్టర్లు)

వివిధ కొత్త మార్గాల్లో ముఖ్యమైనవి
దర్భంగా–బెంగళూరు; దర్భంగా–ఢిల్లీ; దర్భంగా–ముంబై; కార్గిల్‌–శ్రీనగర్‌
హుబ్లీ – అహ్మదాబాద్, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, కన్నూర్‌
కన్నూర్‌ – బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, గోవా, హిండన్, ముంబై, తిరువనంతపురం
బికనీర్‌ – జైపూర్‌
జైసల్మేర్‌ – అహ్మదాబాద్, సూరత్, ఉదయ్‌పూర్‌
పాక్యాంగ్‌(సిక్కిం) – ఢిల్లీ, గువాహటి, కోల్‌కతా
వెల్లూరు – బెంగళూరు, చెన్నై

హెలికాప్టర్‌ ద్వారా.. ముఖ్యమార్గాలు
కులు–మనాలి
సిమ్లా–మండి
మండి–ధర్మశాల
మండి–సిమ్లా
హరిద్వార్‌–హల్‌ద్వని
జోషిమఠ్‌–గౌచర్‌
మసోరి–డెహ్రాడూన్‌  

మరిన్ని వార్తలు