భూమి పూజ‌కు 250 మంది అతిథులు

20 Jul, 2020 09:45 IST|Sakshi

అయోధ్య: అయోధ్యలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న శ్రీరాముని మందిర నిర్మాణం భూమి పూజ‌కు విచ్చేయండి అంటూ శ్రీరామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆహ్వానాల‌ను పంపుతోంది. ఆగస్టు 5న‌ జ‌రిగే ఆల‌య నిర్మాణం పునాది రాయి కార్య‌క్ర‌మానికి సుమారు 250 మంది అతిథుల‌ను పిల‌వనున్న‌ట్లు స‌మాచారం. అయోధ్యలోని ప్ర‌ముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్య‌క్తులు ఈ లిస్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా శ‌నివారం ఆహ్వానం అందింది. (అయోధ్య‌లో బ‌య‌ట‌ప‌డ్డ దేవ‌తా విగ్ర‌హాలు)

అలాగే కొంద‌రు కేంద్ర మంత్రుల‌ను, ఉత్త‌ర ప్ర‌దేశ్ మంత్రుల‌తోపాటు రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్‌, విశ్వ హిందు ప‌రిష‌త్ సీనియ‌ర్ ప్ర‌తినిధుల‌ను కూడా భూమి పూజ కోసం ఆహ్వానించ‌నున్నారు. కాగా రామ మందిరానికి జూన్ 10వ తేదీనే పునాదులు వేయాల‌ని భావించారు. కానీ క‌రోనా కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. దీంతో ఆగ‌స్టు 5న నిర్వ‌హించ‌నున్న ఈ భూమి పూజ కార్య‌క్ర‌మం కాశీ, వార‌ణాసి నుంచి వ‌చ్చే ప్ర‌ముఖ పూజారుల స‌మ‌క్షంలో జ‌రగ‌నుంది. (రామ మందిరం శంకుస్థాపనకు రండి)

మరిన్ని వార్తలు