కేరళలో భారీ వర్షాలు..

10 Aug, 2018 02:23 IST|Sakshi
వాయానాడ్‌ జిల్లాలో నీట మునిగిన కారు. (ఇన్‌సెట్లో) ఇడుక్కిలో చిన్నారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

26 మంది మృతి

వరదతో 24 డ్యాముల గేట్లను ఎత్తివేసిన అధికారులు

అధికారులతో సీఎం సమీక్షా సమావేశం  

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని 24 డ్యాముల గేట్లను అధికారులు ఎత్తివేశారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తతను ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇడుక్కి జిల్లాలో 11 మంది, మలప్పురంలో ఆరుగురు, వాయనాడ్‌లో ముగ్గురు, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్‌లో ఇద్దరు చొప్పున ప్రజలు చనిపోయారు.

ఇడుక్కి జిల్లాలో కొండచరియల కింద చిక్కుకున్న ఇద్దరిని స్థానికులు, పోలీసులు రక్షించగలిగారు. పలు ప్రాంతాల్లో వరద దెబ్బకు రోడ్లు దెబ్బతినడంతో పాటు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆర్చ్‌(వంపుగా ఉన్న) డ్యాముగా పేరుగాంచిన చెరుతోని డ్యామ్‌లో భారీగా వరద నీరు చేరడంతో 26 ఏళ్ల తర్వాత తొలిసారి గేట్లు ఎత్తారు. దీని సామర్థ్యం 2,403 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి నీటిమట్టం ఏకంగా 2,399.58 అడుగులకు చేరుకుంది. వర్షాలు, వరదల ప్రభావంతో ఇడుక్కి, కొల్లాం జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్, మలప్పురం జిల్లాల్లో సహాయక చర్యల కోసం అప్పటికే ఆర్మీ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలను రంగంలోకి దించారు. వరదలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం విజయన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ, కేరళ చరిత్రలో తొలిసారి 24 డ్యాముల గేట్లను ఒకేసారి ఎత్తాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 10,000 మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు సెక్రటేరియట్‌లో 24 గంటలు పనిచేసే పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వే పైకి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో.. విమానాల ల్యాండింగ్‌ను అధికారులు రెండు గంటలపాటు నిలిపివేశారు.

మరిన్ని వార్తలు