తమిళనాట నెత్తురోడిన రోడ్లు

21 Feb, 2020 03:12 IST|Sakshi
బస్సులోనే ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు

రెండు ప్రమాదాలు.. 27 మంది మృతి

అవినాశి వద్ద బస్సును ఢీకొన్న లారీ; 20 మంది కేరళ వాసుల దుర్మరణం

ఓమలూరు వద్ద రెండు బస్సులు ఢీ; ఏడుగురు నేపాలీయుల మృతి

సాక్షి, చెన్నై: తమిళనాడులో గురువారం వేకువజామున రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు ఘటనల్లో కలిపి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుప్పూర్‌ జిల్లా అవినాశి వద్ద బస్సును లారీ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. సేలం– బెంగళూరు జాతీయ రహదారిలో సేలం జిల్లా ఓమలూరు వద్ద నేపాల్‌ నుంచి వచ్చిన పర్యాటకుల బృందం ప్రయాణిస్తున్న మినీ బస్సును మరో ప్రైవేటు బస్సు ఢీ కొన్న మరో ఘటనలో ఏడుగురు నేపాల్‌ వాసులు మరణించారు.  

బెంగళూరు నుంచి వస్తుండగా..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు బుధవారం రాత్రి బయలు దేరింది. ఇందులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. గురువారం వేకువజామున 3 గంటల సమయంలో కేరళ నుంచి సేలంకు వెళ్తున్న లారీ అవినాశి రాకియా పాళయం కూడలి వద్ద డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డుకు మరో వైపు దూసుకెళ్లింది. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న కేరళ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో   బస్సులోని ఇద్దరు డ్రైవర్లు సహా మొత్తం 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ 23 మందిని తిరుప్పూర్, కోయంబత్తూరు ఆసుపత్రులకు తరలించారు.  

ఆధ్యాత్మిక పర్యటనలో..
మరో ఘటనలో.. భారత్‌లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న నేపాల్‌లోని కఠ్మాండూకు చెందిన 32 మంది బృందం రోడ్డు ప్రమాదం బారిన పడింది. కన్యాకుమారి నుంచి రాజస్తాన్‌కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును సేలం– బెంగళూరు జాతీయ రహదారిలోని ఓమలూరు నరిపల్లం వద్ద ఎదురుగా వచ్చిన ఒక ప్రైవేటు బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు నేపాల్‌ వాసులు మరణించారు. గాయపడ్డ 25 మందిని చికిత్స నిమిత్తం సేలం ఆస్పత్రికి తరలించారు.  
 

మరిన్ని వార్తలు