జంతువులపై ప్రేమ జీవితాన్నే మార్చేసింది

21 Nov, 2019 23:05 IST|Sakshi

మన మంచితనం, సహాయక గుణం ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుందనడానికి మరోసారి నిరూపించాడు ఓ 27 ఏళ్ల యువకుడు. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వీధి శునకాలను కాపాడడానికి ఆ యువకుడు కనుగొన్న పద్దతిని మెచ్చి అతన్ని అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా.  ఆ యువకుడి పేరు శాంతను నాయుడు. తాను ఉద్యోగం పొందిన తీరు, శునకాలను కాపాడడానికి కనుగొన్న పద్దతిని ఫేస్‌బుక్‌ పేజీ ‘ హ్యుమాన్స్‌ ఆప్‌ బాంబే’ లో వివరించారు.

‘ఐదేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వీధి కుక్కను చూపి చలించిపోయా. అవి రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నాయని తెలుసుకొని వాటిని ఎలాగైనా కాపాడాలని డిసైడ్‌ అయ్యాను. స్నేహితులతో కలిసి ఓ రిఫ్లెక్టర్‌ బెల్టు(పరావర్తనం చెందే బెల్టులు) ను తయారు చేశాను. రాత్రి పూట డ్రైవర్లకు కనిపించేలా ఆ బెల్టులను వీధి శునకాల మెడకు తొడిగించాను. దీంతో రాత్రి వేళలో శునకాలు రోడ్లపై పరిగెత్తినా.. డ్రైవర్లకు ఆ బెల్టులు కనిపించి వాహనాలను నిలిపివేస్తారు. ఈ ఆలోచనతో రోడ్డు ప్రమాదంలో చనిపోయే శునకాల సంఖ్య భారీగా తగ్గింది.

ఈ ఆలోచన విస్తృతంగా వ్యాపించి టాటా గ్రూప్‌ ఆప్‌ కంపెనీ ‘న్యూస్‌లెటర్‌’లో అచ్చయింది. ఆలోచన బాగానే ఉన్నా.. రిఫ్లెక్ట్‌ బెల్టులను ఉచితంగా పంపిణీ చేయడం నాకు ఆర్థికంగా ఇబ్బందైంది. అదే సమయంలో రతన్‌ టాటాకు శునకాలంటే అమిత ప్రేమ అని, అతనికి లేఖ రాస్తే సహాయం అందుతోందని మా నాన్న సలహా ఇచ్చారు. తొలుత కొంత తటపటాయించినా, రాస్తే పోయేది ఏముందిలే అనుకొని టాటాకు లేఖ రాశాను. ఆ లేఖనే నా జీవితాన్ని మార్చేసింది.

రెండు నెలల తర్వాత నన్ను కలవాలని రతన్‌ టాటా నుంచి లేఖ వచ్చింది. నమ్మలేక పోయాను. కొద్ది రోజుల తర్వాత రతన్‌ టాటాను ఆయన కార్యాలయంలో కలిశాను. నా ఆలోచన ఆయనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఆయన పెంచుకుంటున్న శునకాలను కూడా చూపించాడు. తర్వాత పై చదువుల కోసం విదేశాలకు పోయాను. నేను స్వదేశానికి తిరిగి వచ్చాక టాటా ట్రస్ట్‌లో పనిచేస్తానని ప్రామిస్‌ చేశా. చదువు ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చాక ఓ రోజు రతన్‌ టాటా నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ ఆఫీస్‌లో ఉన్న పనులతో చాలా బీజీ అయిపోతున్నాను. నువ్వు నాకు అసిస్టెంట్‌గా ఉండగలవా ’అని కోరారు. ఒక్కసారిగా షాకయ్యాను.  పారిశ్రామిక దిగ్గజం నన్ను అసిస్టెంట్‌గా ఉంటారా అని అడగడం నమ్మలేకపోయా. వెంటనే సరే అన్నాను’ అని శంతను చెప్పుకొచ్చాడు. కాగా ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘గ్రేట్‌ స్టోరీ’, ‘మన మంచితనం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు