కూర‌గాయ‌ల వ్యాపారుల‌కు క‌రోనా పాజిటివ్

5 May, 2020 09:37 IST|Sakshi

ల‌క్నో : కూర‌గాయ‌ల వ్యాపారులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో వీరి ద‌గ్గ‌రి నుంచి ఎవ‌రెవ‌రు కూర‌గాయ‌లు కొన్నారు? వారితో స‌న్నిహితంగా మెలిగిన వ్య‌క్తులు ఎవ‌రు అన్న విష‌యాలు చేధించ‌డం పోలీసుల‌కు స‌వాలుగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో గ‌డిచిన 10 రోజుల్లోనే 28 మంది కూర‌గాయ‌ల వ్యాపారులకు క‌రోనా వైరస్‌ సోకినట్టు నిర్ధార‌ణ అయ్యింది. వీరిలో ఎక్కువ‌మంది బాసాయి, తాజ్‌గంజ్ మండీల్లో కూర‌గాయ‌లు విక్ర‌యించేవారని అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే ఆగ్రాలో కూర‌గాయ‌ల వ్యాపారుల‌కు క‌రోనా సోక‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మిగ‌తా వీధి వ్యాపారులు, కిరాణా వ్యాపారుల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. (వలస కూలీల్లో కరోనా కలకలం )

అయితే అత్య‌ధికంగా కూర‌గాయ‌ల వ్యాపారుల‌కు కోవిడ్ సోకింది. వీరికి వైర‌స్ ఎలా సోకింద‌నే విష‌యం ఇంకా తెలియ‌లేదు. దీంతో వీరి ద‌గ్గ‌ర కూర‌గాయ‌లు కొన్న కొంత‌మందిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. 160 మంది కూర‌గాయ‌ల వ్యాపారులు, వీధి వ్యాపారుల‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 28 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో క‌రోనా నివార‌ణ నిమిత్తం ఇంటింటికీ కూర‌గాయ‌లు ప్యాకెడ్ క‌వ‌ర్ల‌లో డోర్ డెలివ‌రీ చేస్తున్న‌ట్లు ఆగ్రా ఎస్పీ రోహ‌న్ బోట్రే తెలిపారు. ఇప్ప‌టికే 20 వార్డుల్లో ఇంటింటికీ కూర‌గాయ‌లు పంపిణీ చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే 100 వార్డుల్లో పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆగ్రా మండీ సెక్ర‌ట‌రీ శివ‌కుమార్ పేర్కొన్నారు.  భౌతిక దూరం పాటించేలా అన్ని పండ్ల దుకాణాలు, ఇత‌ర వీధి మార్కెట్ల‌కు  అధికారులు ఆదేశాలు జారీ చేశారు. (ఆరోగ్యం బాలేదని అంబులెన్స్‌కు కాల్‌ చేసి..)

మరిన్ని వార్తలు