29.3 కోట్ల భార్యలకు.. 28.7 కోట్లమందే భర్తలు!

3 Mar, 2015 18:38 IST|Sakshi
29.3 కోట్ల భార్యలకు.. 28.7 కోట్లమందే భర్తలు!

మన దేశంలో ఇప్పుడు పెళ్లయిన భర్తల కంటే.. పెళ్లయిన భార్యల సంఖ్య 66 లక్షలు ఎక్కువగా ఉందట! ఈ విషయం తాజా లెక్కల్లో అధికారికంగా తేలింది. పెళ్లి చేసుకున్న మగాళ్లు ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిపోతూ భార్యలను ఇక్కడే వదిలిపెట్టడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, బహుభార్యత్వం వల్ల కూడా ఈ సంఖ్య ఎక్కువ అయ్యిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 18 లక్షల మంది బాలికలకు పెళ్లిళ్లు అయినట్లు 2011 నాటి జనాభా లెక్కల్లో తేలింది. మొత్తం దేశ జనాభా 120 కోట్లు కాగా, వారిలో 58 కోట్ల మందికి పెళ్లిళ్లు అయ్యాయి. అయితే వీళ్లలో విడాకులు తీసుకున్నవాళ్లు, భర్తలు మరణించిన వాళ్లు, లేదా విడిగా ఉంటున్నవాళ్ల వివరాలు మాత్రం లేవు. మొత్తం 58 కోట్ల మంది వివాహితులలో.. 29.3 కోట్ల మంది మహిళలు కాగా, 28.7 కోట్ల మందే పురుషులు ఉన్నారు.

కేరళలో పెళ్లయిన ప్రతి ఒక్క పురుషుడికి 1.13 మంది వివాహిత మహిళలున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఉన్నాయి. వీటిలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 1.04 నుంచి 1.07 వరకు ఎక్కువగా ఉంది. అయితే.. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి చోట్ల మాత్రం వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు. అక్కడ పెళ్లయిన వాళ్లలో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

మరిన్ని వార్తలు