గుజరాత్‌లో మృగరాజు గర్జన

11 Jun, 2020 08:01 IST|Sakshi

గిర్‌ అడవిలో సింహాల జనాభాలో 29 శాతం వృద్ధి

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని గిర్‌ అటవీ ప్రాంతంలో ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 28.87 శాతం పెరిగిందని, మొత్తం సింహాల సంఖ్య 674కు చేరిందని గుజరాత్‌ అటవీ శాఖ బుధవారం ప్రకటించింది. గిర్‌ అడవిలో ప్రతి ఐదేళ్లకోసారి సింహాల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. 2015లో ఇక్కడ 523 సింహాలు ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది జూన్‌ 5, 6 తేదీల్లో సింహాల జనాభాను లెక్కించారు. 674 ఉన్నట్లు గుర్తించారు. గిర్‌ అడవిలో ఐదేళ్లలో ఈ స్థాయిలో సింహాల జనాభా పెరగడం ఇదే తొలిసారి. 2015లో 22 వేల చదరపు కిలోమీటర్లుగా ఉన్న సింహాల ఆవాస విస్తీర్ణం ఇప్పుడు 30 వేల చదరపు కిలోమీటర్లకు పెరగడం గమనార్హం.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల సింహాల జనాభాను పూర్తిస్థాయిలో లెక్కించలేకపోయామని అధికారులు అన్నారు. ప్రధాని మోదీ హర్షం: గిర్‌ అడవిలో సింహాల సంతతి పెరగడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాటి ఆవాస విస్తీర్ణం కూడా 36 శాత పెరగడం మంచి పరిణామమని తెలియజేశారు. గుజరాత్‌ ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు