ఇక ఇప్పుడు దీవుల వంతు

25 Dec, 2018 13:27 IST|Sakshi

న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో పలు చారిత్రక నగరాలు పేర్లు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్‌కు ఆధ్యుడిగా నిలిచారు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌. ఇప్పటికే యోగి యూపీలోని ఫైజాబాద్‌ పేరును అయోధ్యగా, అలహబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని ఓ మూడు దీవుల పేర్లను మార్చేందుకు సిద్ధమైంది బీజేపీ ప్రభుత్వం. రోస్‌ ఐల్యాండ్‌, నేయిల్‌ ఐల్యాండ్‌, హ్యావ్‌లాక్‌ ఐలాండ్‌ పేర్లను నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఐల్యాండ్‌, షాహీద్‌ ద్వీప్‌, స్వరాజ్‌ ద్వీప్‌ ఐల్యాండ్‌లుగా మార్చనున్నట్లు తెలిసింది. పోర్ట్‌ బ్లెయర్‌ పర్యటన సందర్భంగా ఈ నెల 30న మోదీ ఈ కొత్త పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీలన్ని పూర్తయ్యాయన్నారు అధికారులు. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఆజాద్‌ హింద్‌’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 30 నాటికి  75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే ఈ మూడు అండమాన్‌, నికోబార్‌ దీవుల పేర్లను మార్చేందుకు నిర్ణయించింది. అయితే అండమాన్‌ దీవుల్లోకెల్లా పెద్దది.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన హ్యావ్‌లక్‌ దీవి పేరును మార్చలనే డిమాండ్‌ 2017 నుంచే ఉంది. ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది.

స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా డిసెంబర్ 30 (1943) అండమాన్‌ దీవులకు చేరుకున్న నేతాజీ ఇక్కడ  త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్‌కు షాహీద్‌గానూ, నికోబార్‌కు స్వరాజ్‌గానూ నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు