కేరళకు ‘నిపా’ దెబ్బ

22 May, 2018 03:28 IST|Sakshi
గబ్బిలాలను పట్టుకుంటున్న సిబ్బంది

వైరస్‌ ధాటికి పక్షం రోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

అవే లక్షణాలతో నర్సు సహా మరో ఆరుగురు కూడా..

అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం..

కొజికోడ్‌: నిపా అనే అరుదైన వైరస్‌ కారణంగా కేరళలోని కొజికోడ్‌ జిల్లాలో గత పక్షం రోజుల్లో ముగ్గురు మరణించారు. ఈ వైరస్‌ సోకిన ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తుండగా, మరో 8 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అధిక జ్వరంతో మరో ఇద్దరు నర్సులు కూడా ఆసుపత్రిలో చేరారు. చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారే. నిపా వైరస్‌ కారణంగా మొదట మే 5న ఈ కుటుంబంలోని ఓ యువకుడు (23), మే 18న అతని అన్న (25), మే 19న ఆ కుటుంబంలోని 50 ఏళ్ల మహిళ మరణించారు. ఆ యువకుల తండ్రికి కూడా ఈ వ్యాధి సోకడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చికిత్స పొందుతున్న సమయంలో వారి బాగోగులు చూసుకున్న నర్సు లినీ కూడా సోమవారం మరణించారు. అయితే ఆమె కూడా నిపా వైరస్‌ సోకడం వల్లే చనిపోయారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అటు కొజికోడ్‌ పొరుగు జిల్లా మలప్పురంలోనూ నిపా వైరస్‌ సోకిన లక్షణాలతోనే ఐదుగురు చనిపోయారు. అయితే వీరికి కూడా కచ్చితంగా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కొజికోడ్‌లో ముగ్గురు చనిపోయిన ఇంటిలోని బావిలో గబ్బిలం కనిపించడంతో ఆ బావిని మూసివేశామని అధికారులు తెలిపారు.

కేరళలో హై అలర్ట్‌..
నిపా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున సీఎం పినరయి విజయన్‌ కేరళ అధికారులను అప్రమత్తం చేశారు. మరిన్ని ప్రాణాలు పోకుండా చూసేందుకు అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ కొజికోడ్‌ జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.  వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని శైలజ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా శైలజతో మాట్లాడి జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం నుంచి ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని కొజికోడ్‌కు పంపారు.
గబ్బిలాలను పట్టుకుంటున్న సిబ్బంది

1998లో తొలిసారి..
నిపా వైరస్‌ను తొలిసారిగా 1998లో గుర్తించారు. మలేసియాలోని కాంపుంగ్‌ సుంగై నిపా అనే ప్రాంతంలో ఈ వైరస్‌ను మొదట గుర్తించటంతో దానికి ఆ పేరు పెట్టారు. నిఫాలో ఇది పందుల ద్వారా వ్యాపించింది. ఈ సూక్ష్మక్రిమిని నిరోధించే వ్యాక్సిన్‌ లేదు. పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్‌ సంక్రమిస్తోంది. వైరస్‌ సోకిన గబ్బిలాలు, పందులకి దగ్గరగా మసలడం వల్ల, నిపా వ్యాధి ఉన్న పక్షులు, జంతువులు కొరికి వదిలేసిన పండ్లను తినడం, వైరస్‌ బారిన పడిన వ్యక్తులను నేరుగా తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకినవారిలో సగటున 70 శాతం మంది వరకు మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిపా వైరస్‌ భారతదేశంలో తొలిసారిగా 2001 సంవత్సరంలో పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 66 కేసులు నమోదైతే 45 మంది (68 శాతం) మరణించారు. ఆ తర్వాత 2007 సంవత్సరం పశ్చిమ బెంగాల్‌లోనే నాడియాలోనూ నిపా వైరస్‌ కనిపించింది. కేరళలో ఈ వైరస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి.

లక్షణాలు ఇవీ: నిపా వైరస్‌ సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు చూసినా నిద్రమత్తుగా ఉండడం, మానసికంగా గందరగోళానికి గురవడం కూడా ఈవ్యాధి లక్షణమే. ఒక్కోసారి ఈ మానసిక ఆందోళన మెదడువాపునకు కూడా దారితీస్తుంది. వైరస్‌ సోకిన అయిదు నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకొస్తాయి.


                                             గబ్బిలాలున్న బావిని మూసేస్తున్న దృశ్యం

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు