అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు

17 Mar, 2020 06:14 IST|Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తలుపు తట్టారు. ఈ కేసు విచారణ తప్పులతడకగా సాగిందని, తమను బలిపశువులుగా చేసి, అన్యాయంగా శిక్ష విధించారని ఆరోపించారు. ‘మాకు పాలీగ్రాఫ్, లై డిటెక్టర్, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ వంటి పరీక్షలు కూడా చేయాలని కోరినా దర్యాప్తు అధికారులు పట్టించుకోలేదు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి, మమ్మల్ని బలిపశువులుగా మార్చారు.

దీనిపై ఐసీజే జోక్యం చేసుకుని తక్షణమే విచారణ జరపాలి’ అని వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. నలుగురు దోషులకు న్యాయపరమైన వెసులుబాటు మార్గాలు ఇంకా మిగిలి ఉండగానే తీహార్‌ జైలు అధికారులు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్ష అమలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని దోషుల తరఫున లాయర్‌ ఏపీ సింగ్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు.. న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్‌ సింగ్‌ పెట్టుకున్న పిటిషన్‌ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో రివ్యూ పిటిషన్, క్యూరేటివ్‌ పిటిషన్లను కూడా తిరస్కరిస్తూ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన దోషులు ముకేశ్‌ సింగ్‌(32), అక్షయ్‌ సింగ్‌(31), పవన్‌గుప్తా(25), వినయ్‌ శర్మ(26)కు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఈనెల 5వ తేదీన తాజాగా న్యాయస్థానం వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తీహార్‌ జైలు అధికారులు తలారి పవన్‌ జల్లాడ్‌ను పంపాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌ అధికారులకు లేఖ రాశారు. ముకేశ్, పవన్, వినయ్‌లు ఆఖరిసారిగా తమ కుటుంబసభ్యులను ముఖాముఖి కలుసుకున్నారు. అక్షయ్‌ కుటుంబసభ్యులు కూడా ఒకట్రెండు రోజుల్లో రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు