మదురై ఆస్పత్రిలో దారుణం

9 May, 2019 05:02 IST|Sakshi

వెంటిలేటర్లు పనిచేయక ఐదుగురు రోగులు మృతి!

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ఒకరి తరువాత మరొకరు ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటన మంగళ, బుధవారాల్లో జరిగింది. మదురైలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీయడంతోపాటు భారీ స్థాయిలో వర్షం కురిసింది. దీంతో సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతమంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఆస్పత్రికి కూడా కరెంటు సరఫరా నిలిచిపోవడం, జనరేటర్ల ద్వారా విద్యుత్‌ సరఫరా ఆలస్యం కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్‌ అందకపోవడంతో విలవిల్లాడారు. ఈ నేపథ్యంలో మదురై జిల్లా మేలూరుకు చెందిన మల్లిక (55), దిండుగల్లు జిల్లా ఒట్టనసత్రంకు చెందిన పళనియమ్మాళ్‌ (60), విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రవీంద్రన్‌ (52) ప్రాణాలు విడిచారు. బుధవారం ఉదయం మదురై సెల్లూరుకు చెందిన చెల్లత్తాయ్‌ (55), తిరుప్పూరు జిల్లా పల్లడంకు చెందిన ఆర్ముగం (48) కూడా మృతి చెందారు. అయితే వెంటిలేటర్‌ పనిచేయక పోవడం వల్ల కాదని, వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెంచారని ఆస్పత్రి డీన్‌ వనిత చెప్పారు. 

>
మరిన్ని వార్తలు