కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

22 Sep, 2018 05:03 IST|Sakshi
ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సహచరులకు నివాళులర్పిస్తున్న పోలీసులు

షోపియాన్‌ జిల్లాలో ముగ్గురు పోలీసుల కిడ్నాప్‌.. హత్య

స్పెషల్‌ పోలీసు అధికారులే లక్ష్యంగా హిజ్బుల్‌ దాడులు

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: కశ్మీర్‌ రాష్ట్రంలోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు దురాగతానికి ఒడిగట్టారు. ముగ్గురు స్పెషల్‌ పోలీసు అధికారులను(ఎస్పీవో) శుక్రవారం వారి ఇళ్ల నుంచి అపహరించి దారుణంగా హత్య చేశారు. పోలీసుల్ని ఇంటి నుంచి అపహరించి హత్య చేయడం ఆ రాష్ట్ర ఉగ్రవాద చరిత్రలో ఇదే మొదటిసారి.   

ఉగ్రవాదుల వెంటపడ్డ గ్రామస్తులు
‘శుక్రవారం ఉదయం షోపియాన్‌ జిల్లాలోని బాటాగండ్, కప్రన్‌ గ్రామాల నుంచి ముగ్గురు ఎస్పీవో సిబ్బందిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. బాటాగండ్‌ గ్రామస్తులు ఉగ్రవాదుల వెంటపడి పోలీసుల్ని కిడ్నాప్‌ చేయవద్దని వేడుకున్నారు. ఉగ్రవాదులు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తుల్ని బెదిరించారు’ అని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు సమీపంలోని నదిని దాటి తీరం వెంట ఉన్న తోటలో పోలీసుల్ని దారుణంగా హత్యచేశారని వారు తెలిపారు. మృతి చెందిన పోలీసుల్ని కానిస్టేబుల్‌ నిస్సార్‌ అహ్మద్, ప్రత్యేక పోలీసు అధికారులు ఫిర్దౌస్‌ అహ్మద్, కుల్వంత్‌ సింగ్‌లుగా గుర్తించారు.

ఈ హత్య తామే చేసినట్లు హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందినదిగా భావిస్తున్న ట్విటర్‌ ఖాతాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ పని హిజ్బుల్‌ ఉగ్రవాదులదేనని భద్రతా విభాగాలు కూడా నిర్ధారణకు వచ్చాయి. దీనిని పిరికిపందల చర్యగా కశ్మీర్‌ రేంజ్‌ పోలీసు ఐజీ స్వయంప్రకాశ్‌ పాణి పేర్కొన్నారు. ‘భద్రతా దళాల ఏరివేతతో ఉగ్రవాదులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు. పాశవికమైన ఈ ఉగ్ర దాడిలో ముగ్గురు సహచరులను కోల్పోయాం. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని త్వరలోనే చట్టం ముందు నిలబెడతాం’ అని ఆయన చెప్పారు.  

ఆందోళనలో ఎస్పీవోలు
ఈ హత్యలు పోలీసు విభాగంలోని కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు తెరతీశాయి. ఆరుగురు ఎస్పీవోలు తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. తాము ఉద్యోగాలను వదులుకుంటున్నామని సామాజిక మాధ్యమాల్లో ఇద్దరు ఉద్యోగుల వర్తమానాలు వాటికి మరింత ఊతమిచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనంటూ కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కశ్మీర్‌లో మొత్తం 30 వేలకు మించి ఎస్పీవోలు పనిచేస్తున్నారు. కొన్ని పరిపాలన కారణాల వల్ల వారి సేవల్ని పునరుద్ధరించని సంఘటనల్ని రాజీనామాలుగా చిత్రీకరించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి’ అని హోంశాఖ పేర్కొంది.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న బలవంతపు అణచివేత చర్యలతో ఫలితం లేదని పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కిడ్నాపు ఘటనల్ని రుజువు చేస్తున్నాయని మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. చర్చలే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారమని ఆమె పేర్కొన్నారు.

సుష్మ–ఖురేషి భేటీ రద్దు
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి మధ్య న్యూయార్క్‌లో జరగాల్సిన సమావేశాన్ని భారత్‌ రద్దుచేసుకుంది. అంతకుముందు కశ్మీర్‌లోని షోపియాన్‌లో ఉగ్రవాదులు ముగ్గురు పోలీసులను అపహరించి కిరాతకంగా హత్యచేయడం, ఉగ్రవాది బుర్హాన్‌ వనీని కీర్తిస్తూ పాకిస్తాన్‌ స్టాంపులు విడుదల చేయడమే ఇందుకు కారణమని ప్రకటించింది. ఈ సంఘటనలు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నిజ స్వరూపాన్ని, చర్చల ప్రతిపాదన వెనక ఉన్న దుష్ట అజెండాను తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. భేటీ రద్దును విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ ధ్రువీకరించారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి గురువారం అంగీకరించిన భారత్‌.. కశ్మీర్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంది.
 

మరిన్ని వార్తలు