ఘోర ప్రమాదం: ముగ్గురు విద్యార్థినుల సజీవ దహనం

22 Feb, 2020 19:24 IST|Sakshi

చండీగఢ్‌: చండీగఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సెక్టార్ 32 వద్ద ఉన్న పీజీ వసతి గృహంలో శనివారం ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. ల్యాప్‌టాప్‌ చార్జ్‌ చేస్తుండగా మంటలంటుకున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు అగ్నిప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా తేల్చలేదు. అలాగే ఈ భవనంలో కనీస భద్రతా చర్యలేవీ తీసుకో లేదనీ,  అనేక అగ్నిమాపక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు అగ్నిమాపక అధికారులు చెప్పారు.

సెక్టార్ 32 లోని పీజీ వసతి గృహంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు యువతులు మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అధికారులు తెలిపారు. భవనం పై అంతస్తులో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా గుర్తించామన్నారు. భవనం మొదటి అంతస్తులో మరణించిన విద్యార్థినులు పేయింగ్‌ గెస్ట్‌లుగా వుంటున్నారని చండీగఢ్‌ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు. 19-22 సంవత్సరాల వయస్సు వీరిని పంజాబ్‌, హర్యానాకు చెందిన ముస్కాన్, రియా, ప్రాక్షిగా గుర్తించారు. మరో విద్యార్థిని భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మొత్తం 36 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉన్నట్టు సమాచారం. పోలీసు, రక్షక బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు