ప్రభుత్వాస్పత్రి నిర్వాకం.. చిన్నారికి హెచ్‌ఐవీ

20 Feb, 2019 15:54 IST|Sakshi
హెచ్‌ఐవీ

చెన్నై : ఓ ప్రభుత్వాస్పత్రి నిర్వాకంతో ఓ మూడేళ్ల చిన్నారి హెచ్‌ఐవీ బాధితురాలైంది. రక్తమార్పిడి సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆ పసిపాప పాలిట శాపంగా మారింది. రక్తమార్పిడి జరిగిన ఏడు నెలల అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆ చిన్నారికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. అనుమానంతో ఆ పాప తల్లిదండ్రులను పరీక్షించగా వారికి ఎలాంటి వైరస్‌ సోకలేదని స్పష్టమైంది. ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వ ఆసుప్రతి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్‌ తమిళనాడులోని త్రిచిలో నివసించే ఓ జంట.. ఆనారోగ్యంతో బాధపడుతున్న తమ మూడేళ్ల కూతురిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. హెచ్‌ఐవీ పాజిటీవ్‌ అని తేలింది. దీంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. తమపై అనుమానంతో పరీక్షలు చేయించుకున్నారు. కానీ వారికి నెగటీవ్‌ వచ్చింది. దీంతో గతంలో తమ పాపకు రక్తమార్పిడి చేసే సమయంలో వైద్యుల చేసిన పొరపాటు ఫలితమేనని గ్రహించారు. 

గతేడాది జూలై 11న తమ కూతురికి రక్తాన్ని ఎక్కించారని, అయితే రక్తం ఎక్కించే సమయంలో వైద్యులు పొరపాటున ఓ వృద్ధుడి రక్తాన్ని ఎక్కించారని, ఇది తెలుసుకొని మధ్యలోనే ఆపేశారని ఆ చిన్నారి తండ్రి తెలిపారు. అప్పుడు పాప ఆరోగ్యం కుదటపడటంతో అంతగా పట్టించుకోలేదని, కానీ ఈ నెల 8న మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే హెచ్‌ఐవీ అని తేలిందన్నారు. ఈ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్న మరో ఇద్దరు కూడా హెచ్‌ఐవీ వచ్చిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విచారణకు ఆదేశించలేదు.

మరిన్ని వార్తలు