నింగిలోకి 31 ఉపగ్రహాలు

24 Jun, 2017 08:04 IST|Sakshi
నింగిలోకి 31 ఉపగ్రహాలు
ఇస్రో ఖాతాలో మరో అరుదైన ఘనత
- అంతరిక్షంలోకి కార్టోశాట్‌ 2ఈ, స్వదేశీ ఉపగ్రహంతో పాటు  29 విదేశీ ఉపగ్రహాలు
23.18 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ఉపగ్రహాలు
భౌగోళిక సమాచార సేవలు అందించనున్న కార్టోశాట్‌ 2ఈ
 
శ్రీహరికోట (సూళ్లూరుపేట):  వినువీధిలో విజయ పరంపరను ఇస్రో కొనసాగిస్తోంది. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంటూ.. 955 కిలోల బరువున్న 31 ఉపగ్రహాల్ని శుక్రవారం నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మొదట్లో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని, ఈ నెల్లోనే మార్క్‌ 3డీ1 వంటి భారీ ఉపగ్రహాన్ని  ప్రయోగించి సత్తా చాటిన ఇస్రో తాజా ప్రయత్నంతో మరో మైలు రాయిని అధిగమించింది. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు 44.4 మీ. పొడవైన పీఎస్‌ఎల్‌వీ సీ 38 ఉపగ్రహ వాహకనౌక 31 ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. గురువారం ఉదయం 5.29 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ 28  గంటలు కొనసాగింది. 23.18 నిమిషాల్లో భూమికి 505 కి.మి. – 509 కి.మి. ఎత్తులో సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టింది. కార్టోశాట్‌ 2ఈ, తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం వర్సిటీకి చెందిన నియూశాట్‌ ఉపగ్రహాన్ని 16.50 నిమిషాలకు నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. 
 
హసన్‌లోని మాస్టర్‌ కంట్రోల్‌ రూంకు సిగ్నల్స్‌
అనంతరం ఏడు నిమిషాలకు 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాల్ని 9 రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. వీటిలో లీమూర్‌–2, సీసీరో–6, టైవాక్‌–53బీ(అమెరికా), డైమండ్స్‌–3(బ్రిటన్‌), క్యూబీ50–బీఈ06, ఇన్‌ఫ్లేట్‌ శైల్, యూసీఐ శాట్‌(బెల్జియం), ఉర్స్‌మియార్, డీశాట్, మ్యాక్స్‌వెల్లర్‌(ఇటలీ), సుచోయ్‌–1(చిలీ), ఎజ్‌లూశాట్‌–1(చెక్‌ రిపబ్లిక్‌), ఆల్టో–1(ఫిన్‌ల్యాండ్‌), రోబూస్టా–1బీ( ఫ్రాన్స్‌), క్యూబీ 50–డీఈ04(జర్మనీ)ఉపగ్రహాలతో పాటు  జపాన్, లాత్వియా, లిథువేనియా, స్లోవేకియా దేశాల ఉపగ్రహాలున్నాయి.   ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశించిన వెంటనే కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్, మారిషస్‌లోని గ్రౌండ్‌స్టేషన్‌కు సిగ్నల్స్‌ అందడం మొదలయ్యాయి. కార్టోశాట్‌–2ఈ ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది.  పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం.
 
ఇస్రోలో సంబరాలు.. ప్రయోగం విజయవంతం కాగానే మిషన్‌ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఒకేసారి 31 ఉపగ్రహాల ప్రయోగం  చరిత్రాత్మక విజయమని, ఇస్రో టీం సమష్టి కృషని అభివర్ణించారు. పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలు 200లు దాటాయని, ఇదొక సువర్ణాధ్యాయమన్నారు.     
 
శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌:  ప్రయోగం ఇస్రో చరిత్రలో కీలక మైలురాయని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. కిరణ్‌ కుమార్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి అభినందించారు. శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తారు. భారత్‌ గర్వపడేలా ఇస్రో పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్‌లూ  శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం విజయవంతంపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.  
 
మన ఖ్యాతి ఇనుమడించింది: జగన్‌
పీఎస్‌ఎల్‌వీ–సీ 38 ఉపగ్రహ వాహక నౌకను దిగ్విజయంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ ప్రయోగంతో అంతర్జాతీయంగా మన దేశఖ్యాతి ఇనుమడించిందన్నారు. 
 
కార్టోశాట్‌ సిరిస్‌లో ఆరో ఉపగ్రహం
భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్‌ సిరీస్‌ ప్రయోగాలను ఇస్రో కొనసాగిస్తోంది. ఈ ఉపగ్రహాల ప్రయోగం 2005 లోనే ప్రారంభం కాగా.. అనంతరం కార్టోశాట్‌–2(2007), కార్టోశాట్‌–2ఏ( 2008), కార్టోశాట్‌–2బీ(2010), కార్టోశాట్‌–2సీ, 2డీ(2016)ల్ని ప్రయోగించారు. వాటిలో అయిదు ఉపగ్రహాలు ఇంకా సేవలందిస్తున్నాయి. తాజాగా కార్టోశాట్‌ 2ఈ ప్రయోగంతో మరో ముందడుగు పడింది. కార్టోశాట్‌ ఉపగ్రహ వ్యవస్థ 505 కి.మి. ఎత్తులో పరిభ్రమిస్తూ భౌగోళిక సమాచారాన్ని అందచేస్తుంది. ఫ్రాంక్రోమాటిక్‌ మల్టీ స్ప్రెక్ట్రల్‌ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను పంపిస్తుంది.

పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ,  నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌లు తయారు చేయడం, విపత్తుల్ని విస్తృతంగా అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడతాయి. సైనిక నిఘాలో, సైనిక సామర్థ్యం పెంపొందించేందుకు కూడా ఇది సాయమందిస్తాయి. భూమి మీద మార్పుల్ని ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. 
 
గ్రహాంతర ప్రయోగాలకు సిద్ధం
శ్రీహరికోట: ఇస్రో భవిష్యత్‌లో నాలుగు గ్రహాంతర ప్రయోగాలు చేసేందుకు అధ్యయనం చేస్తోందని, 2018–19 నాటికి ఈ ప్రయోగాలకు సిద్ధమవుతామని చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషితోనే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపడతామని తెలిపారు. ఇస్రో భవి ష్యత్‌ ప్రయోగాలపై ఆయన చెప్పిన వివరాలు..
అంగారకుడిపై మరిన్ని పరిశోధనలకు మార్స్‌–2, చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్‌–2, సూర్యుడిపై ఆదిత్య–1, శుక్ర గ్రహంపై ‘వీనస్‌’ ఉపగ్రహాల ప్రయోగాలకు జరుగుతున్న అధ్యయనం.
2018 డిసెంబర్‌ నాటికి ఈ నాలుగు ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం.
ఈ నెల 28న ఫ్రెంచ్‌ గయానా(కౌరూ) నుంచి జీశాట్‌–17 ఉపగ్రహ ప్రయోగం.
► సాంకేతిక లోపం ఉన్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఏ స్థానాన్ని భర్తీచేసేందుకు జూలై చివర్లో మరో ప్రయోగం.
భవిష్యత్తులో ఏడాదికి 8–10 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు, రెండేసి చొప్పున జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌2, జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌3 రాకెట్ల ప్రయోగం.
మరిన్ని వార్తలు